
పారిస్: హాకీ టీమ్ గోల్ కీపర్‌గా తనకు ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరు వస్తారని పీఆర్. శ్రీజేష్ అన్నాడు. తన స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ప్లేయర్‌ను కనుగొనే ప్రతిభ ఇండియాకు ఉందన్నాడు. ‘నేను రిటైర్ కావడం వల్ల ఎలాంటి శూన్యత ఉండదు. ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు. ప్రతి క్రీడల్లో ఇది సహజం. అప్పట్లో సచిన్ ఉంటే ఇప్పుడు విరాట్ వచ్చాడు. రేపు అతని ప్లేస్‌లో మరొకరు వస్తారు. హాకీలో ఇప్పటి వరకు శ్రీజేష్ ఉన్నాడు.. అతని ప్లేస్‌లో మరో ప్లేయర్ వస్తాడు’ అని శ్రీజేష్ పేర్కొన్నాడు.
ఇన్నాళ్లూ హాకీ చుట్టు తిరిగిన తన జీవితం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదన్నాడు. ‘నాకు హాకీ తప్ప మరొకటి తెలియదు. 2002లో క్యాంప్‌కు వెళ్లిన రోజు నుంచి ఇప్పటి వరకు తోటి ఆటగాళ్లతోనే ఉన్నాను. ఇప్పుడు వాళ్లకు దూరంగా ఉంటున్నా. నేను ఏమి కోల్పోతున్నానో అర్థం కావడం లేదు. ట్రెయినింగ్, జిమ్, మ్యాచ్‌ల సందర్భంగా మీటింగ్స్ సరదాగా సాగిపోయేది.
విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఓడినప్పుడు కలిసి ఏడవడం నా జీవితంలో సర్వసాధారణంగా కనిపించేవి. బయటి పరిస్థితుల గురించి ఏమాత్రం అవగాహన ఉండేది కాదు’ అని శ్రీజేష్ వ్యాఖ్యానించాడు. సెమీస్‌లో జర్మనీతో చేతిలో ఓడటం కొంత నిరాశ కలిగించిందన్న శ్రీజేష్.. జూనియర్ నేషనల్ కోచ్ ఆఫర్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. దీనిపై ఫ్యామిలీతో చర్చించాలని చెప్పాడు. కెరీర్ ఆరంభంలో కొత్త ప్లేయర్లకు ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్పాలని శ్రీజేష్ సూచించాడు.