శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య టెస్ట్ క్రికెట్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్లను చుట్టేస్తున్నాడు. స్వదేశంలో మ్యాచ్ జరిగితే చాలు ఒంటి చేత్తో లంకకు విజయాలను అందిస్తున్నాడు. ఆడింది 20 టెస్ట్ మ్యాచ్ లే అయినా ప్రపంచ రికార్డులు కొల్లగొడుతున్నాడు. 5 వికెట్లు తీసుకోవడమంటే ఈ స్పిన్నర్ కు మంచినీళ్లు తాగినంత పని. గాలే వేదికగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మరోసారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు.
లబు షేన్, స్టీవ్ స్మిత్, క్యారీ, ఇంగ్లిస్, స్టార్క్ వికెట్లను పడగొట్టాడు. ఇప్పటివరకు 20 మ్యాచ్ ల్లో 115 వికెట్లు తీసిన ఈ 32 ఏళ్ళ స్పిన్నర్.. ఏకంగా 11 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకోవడం విశేషం. ఒక మ్యాచ్ లో 10 వికెట్ల ఘనతను రెండు సార్లు అందుకున్నాడు. ప్రభాత్ జయసూర్య అద్భుతంగా రాణించినా రెండో టెస్టులో శ్రీలంక ఓటమి దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో కేవలం 54 పరుగుల ఆధిక్యంలో ఉంది.
2022లో అతను ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసి తొలి టెస్టులోనే 12 వికెట్లు తీసుకొని ఔరా అనిపించాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ ఆరేసి వికెట్లు తీశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ తో జరిగిన రెండు టెస్టుల్లో మరో 17 వికెట్లు తీసుకున్నాడు. ఆ సిరీస్ లోనూ రెండుసార్లు ఐదుకుపైగా వికెట్లు తీశాడు. 2023 లో ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్‌ను ఔట్ చేసి తన 50వ టెస్టు వికెట్‌ని సాధించి 71 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు.
జయసూర్య తన ఏడో టెస్టులో 50 వికెట్ల మార్క్‌ను కొట్టి వెస్టిండీస్‌కు చెందిన ఆల్ఫ్ వాలెంటైన్ రికార్డును బ్రేక్ చేశాడు.తక్కువ మ్యాచ్‌లలో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్న స్పిన్నర్‌గా నిలిచాడు. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న బౌలర్ రికార్డు ఇప్పటికీ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ చార్లీ టర్నర్ పేరిటే ఉంది. అతడు 1988లో ఇంగ్లండ్ తో తన ఆరో టెస్టులోనే 50 వికెట్లు తీశాడు.
Another fifer for Prabath Jayasuriya#SLvsAUS pic.twitter.com/FM6Gw3b72N
— Rohit Baliyan (@rohit_balyan) February 8, 2025