
- సిట్ అధికారులకు సమాచారం అందించిన పాస్‌పోర్ట్ అథారిటీ
- ఇప్పటికే ప్రభాకర్‌రావుపై రెడ్‌కార్నర్ నోటీసులు
- 10 గంటల పాటు శ్రవణ్ రావు విచారణ
- ఏమడిగినా తెలీదు.. గుర్తులేదని సమాధానం
- ఫోన్ పాస్వర్డ్లు చెప్పని నిందితుడు
హైదరాబాద్, వెలుగు: సెల్‌ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దు అయ్యింది. ఈ మేరకు పాస్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించింది. ఈ కేసులో ప్రభాకర్‌రావుపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయింది. అమెరికాలోనే స్థిరపడేందుకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన పాస్‌పోర్టుల జప్తు కారణంగా గ్రీన్‌కార్డు లభించలేదని తెలిసింది.
తమ పాస్‌పోర్టులను రద్దు చేయొద్దని ప్రభాకర్‌రావు రీజినల్ పాస్‌పోర్ట్ అథారిటీని ఆశ్రయించాడు. కానీ ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ కావడంతో పాస్‌పోర్ట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్టును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమెరికా కాన్సులేట్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో వీలైనంత త్వరగా ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.