శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలతో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈనెల 16న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో మంగళవారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన త్రిదండి చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ ‘రాముడు మనందరిలో ఉన్నాడు. కానీ మనలోని రాముడిని బయటకు తీసుకొచ్చే వాళ్లు కావాలి. ప్రభాస్ ఈ సినిమా ద్వారా ఆ పని చేస్తున్నాడు. నిజమైన ‘బాహుబలి’ రాముడని లోకానికి నిరూపించడానికి వచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. రాముడు స్వయాన విష్ణుమూర్తి అయినప్పటికీ రామాయణంలో మనిషిగానే ప్రవర్తించాడు. ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే సమాజం అతనికి ఆలయాలు కట్టి ఆదర్శం చేసుకుంటుందని మానవ జాతికి మార్గాన్ని చూపించిన ఆదర్శ పురుషుడు రాముడు. అలాంటి రాముడి గురించి ఆధునిక టెక్నాలజీతో ఈ సినిమా తీశారు.
రామాయణంలోని అరణ్య కాండ, యుద్ధకాండల్లో ఉన్న ప్రధాన కథను చరిత్రగా లోకానికి అందిస్తున్నాం అని నాకు చెప్పారు. ఇంతకంటే మహోపకారం మరొకటి ఉండదు. అలాంటి మంచి పని చేస్తున్న ‘ఆదిపురుష్’ టీమ్ అందరికీ ఆ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాను.’ అన్నారు.
టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘ఇండియన్ సినిమాకు గొప్ప పేరు తీసుకొచ్చేలా హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో ఈ సినిమా నిర్మించారు. సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. కృతి సనన్ మాట్లాడుతూ ‘తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసి, తొమ్మిదేళ్ల తర్వాత ‘ఆదిపురుష్’లోని సీత పాత్ర ద్వారా మళ్లీ మీ ముందుకొస్తున్నా. కెరీర్ మొత్తం ప్రయత్నిస్తే కూడా ఇలాంటి అదృష్టం చాలా తక్కువమందికి వస్తుంది. కానీ నాకు తొమ్మిదేళ్ల కెరీర్‌లోనే దక్కింది. అది ఆ దేవుడి, ప్రేక్షకుల బ్లెస్సింగ్‌గా భావిస్తున్నా. ఇక ప్రభాస్ కళ్ళల్లో ఉన్న ప్యూరిటీ చూస్తే.. ఇందులో రాముడు క్యారెక్టర్ తను తప్ప వేరే వాళ్ళు చేయలేరేమో అనిపించింది’ అని చెప్పింది. దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని పెద్ద కాన్వాస్‌పైకి తీసుకొచ్చేలా చేసిన నిర్మాతకు, టీమ్ అందరికీ థ్యాంక్స్. ప్రభాస్ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ఇది అందరి సినిమా.. ఇండియా సినిమా. జూన్ 16న థియేటర్‌లో కలుద్దాం’ అన్నాడు. టీ సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ మాట్లాడుతూ ‘ఓం రౌత్ వల్ల రాముడిపై సినిమా తీయాలనే మా నాన్న కోరిక నెరవేరింది. అందుకు ప్రభాస్‌కు థ్యాంక్స్. ఇది కేవలం సినిమా కాదు. ఒక ఎమోషన్’ అన్నారు. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. మ్యూజిక్ డైరెక్టర్స్ అతుల్, అజయ్, దేవదత్త నాగ, సన్నీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
టీజర్ రిలీజ్ తర్వాత అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహంతో మా టీమ్ అంతా ఎనిమిది నెలల పాటు ఒక యుద్ధం చేశారు. ‘రామాయణంలో నటిస్తున్నావా’ అని ఒకసారి చిరంజీవి గారు అడిగారు.. నిజంగా ఈ సినిమా చేయడం మా అదృష్టం.
రామాయణం అనేది చాలా పవర్‌ఫుల్. మాకు ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. మొత్తానికి పూర్తి చేశాం. ఓంరౌత్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా ఇరవై ఏళ్ల కెరీర్‌లో ఇలా ఎవరినీ చూడలేదు. తనకు హ్యాట్సప్. అతిథిగా హాజరైన చిన్న జీయర్ స్వామి గారికి థ్యాంక్స్. భూషణ్ గారు దీన్ని సినిమాలా కాకుండా దీన్నొక ఎమోషన్‌గా తీసుకున్నారు. లక్ష్మణుడిగా కీలకమైన పాత్రలో సన్నీసింగ్ చక్కగా నటించాడు. ఇక దేవదత్త నాగతో నటించినప్పుడు తనే రియల్ హనుమంతుడు అనే ఫీల్ కలిగింది. ఏ హీరోయిన్‌కు అయితే చాలామంచి పేరు ఉందో.. తననే సీత పాత్రకు తీసుకోవాలని చాలా టైమ్ తీసుకున్నారు. కన్నీటితో కృతి ఇచ్చిన ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో టీమ్ అంతా తనని సీతగా ఫిక్సయ్యారు. అద్భుతంగా నటించింది. ఇక నా బలం అభిమానులే. వాళ్ల కోసమే ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నా. ఒక్కోసారి మూడు కూడా రావొచ్చు. తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తాను. పెళ్లెప్పుడు అని అభిమానులు అడగ్గా... ఎప్పుడైనా తిరుపతిలోనే చేసుకుంటా’ - ప్రభాస్