కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటుచేసుకున్న విషాదాన్నికి సినిమా ఇండస్ట్రీ అంతా స్పందిస్తుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) వయనాడ్ బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రభాస్ టీమ్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రకృతి సృష్టించిన ఈ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని..ప్రభాస్ ఇంత మొత్తాన్ని ప్రకటించడంతో మరోసారి తన మంచి మనుసును చాటుకున్నారు. రెబల్ స్టార్..ఆల్వేస్ రియల్ స్టార్, రాజు ఎక్కడున్నా రాజే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇప్పటికీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్‌చరణ్ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ‘వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే అల్లు అర్జున్ రూ.25 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల తర్వాత, కేరళలో ఎనలేని అభిమానుల్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అక్కడి ప్రేక్షకులకు సుపరిచితుడు. ఈ సందర్భంగా కేరళలో నెలకొన్న పరిస్థితి తనని బాధించిందని ట్వీట్ చేశాడు. ఇక హీరోయిన్లలో రష్మిక పది లక్షలు ప్రకటించగా, సంయుక్త మీనన్ వయనాడ్ బాధితుల సహాయార్థం కొంత సాయం చేసింది. వయనాడ్‌లో సహాయ కార్యక్రమాలు చేస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్‌కు ఆమె చెక్‌ను అందజేసింది.
తమిళ నటులు సూర్య, కార్తి, జ్యోతిక కలిసి 50 లక్షల రూపాయలను ఇవ్వగా, కమల్ హాసన్ రూ.25 లక్షలు, ఫహాద్ ఫాజిల్, నజ్రియా రూ.25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, మమ్ముట్టి రూ.15 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.మరోవైపు నటుడు మోహన్‌లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ. 3 కోట్ల విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్టు తెలిపారు.