ఇంటర్ ప్రాక్టికల్స్ ఈసారైనా  జంబ్లింగ్ లో జరిగేనా?

ఇంటర్ ప్రాక్టికల్స్ ఈసారైనా  జంబ్లింగ్ లో జరిగేనా?
  • ఇంటర్ బోర్డు అధికారుల కసరత్తు 
  • ఐదేండ్లు వాయిదా వేసిన గత సర్కారు 
  • కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడితో అప్పట్లో వెనక్కి

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఇంటర్ ప్రాక్టికల్స్ పై అందరి దృష్టి పడింది. ఈసారైనా ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంలో కొనసాగుతాయా, లేక పాత విధానంలోనేనా అన్న దానిపై చర్చ మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానాన్ని ఐదారేండ్ల పాటు వాయిదా వేసింది. తర్వాత కొత్త ప్రభుత్వం రావడంతో ప్రాక్టకిల్స్ నిర్వహణపై చర్చ జరుగుతున్నది. 

రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ కూడా రిలీజైంది. క్వశ్చన్ పేపర్ల తయారీ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఫస్ట్ వీక్​లో జరిగే ప్రాక్టికల్స్ నిర్వహణపై ఇంటర్ బోర్డు దృష్టి పెట్టింది. ఈ సారి జంబ్లింగ్​లో పెడితే ఎలా ఉంటుందో చర్చ ప్రారంభించింది. ఐదు రోజుల క్రితం ఇంటర్ బోర్డు సెక్రటరీగా కృష్ణ ఆదిత్యను సర్కారు నియమించింది. ఆయన ఇటీవల జరిగిన ఇంటర్ బోర్డు అధికారుల సమావేశాల్లో జంబ్లింగ్ విధానంపై చర్చించినట్టు తెలిసింది. త్వరలోనే దీనిపై సర్కారు పెద్దల దృష్టికి తీసుకుపోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.

గతంలో కార్పొరేట్ కాలేజీల ఒత్తిడితో

గతంలో ఇంటర్ బోర్డు అధికారులు జంబ్లింగ్ విధానంపై సర్కారు దృష్టికి తీసుకుపోయినా.. ప్రతిసారి వచ్చే ఏడాది అంటూ వాయిదా వేసింది. దీనికి కార్పొరేట్ కాలేజీల నుంచి ఒత్తిడే కారణమనే ఆరోపణలున్నాయి. గతంలో ఇంటర్ బోర్డు సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్ జంబ్లింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా.. గత సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే, ప్రస్తుతం ఇంటర్ మార్కులకు ఎంసెట్ (ఈఏపీసెట్)లో వెయిటేజీ లేకపోవడంతో ప్రాక్టికల్స్ మార్కులపై మేనేజ్ మెంట్లు పట్టించుకోవనే వాదనలున్నాయి. కానీ, జంబ్లింగ్ విధానం అమలు చేస్తే కాలేజీల్లోని వసతుల వివరాలు బయటపడతాయనే ప్రచారం జరుగుతున్నది. మెజారిటీ కార్పొరేట్ కాలేజీలు.. ప్రాక్టికల్స్ సమయంలోనే ఇతర కాలేజీల నుంచి పరికరాలు, కెమికల్స్ తీసుకొచ్చి ‘మమా’ అనిపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

క్వాలిటీ పెంపుకు ఇవే కీలకం

ప్రస్తుతం క్వాలిటీ ఎడ్యుకేషన్​పై సర్కారు దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇంటర్ సెకండియర్ సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్లకు నిర్వహించే ప్రాక్టికల్స్ ను సీరియస్ గా తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేకున్నా.. ప్రతి సబ్జెక్టులో 30కి 30 మార్కులు వేస్తున్నారు. అలాంటి చాలా మంది విద్యార్థులకు ప్రాక్టికల్స్ కు వాడే పరికరాలు, కెమికల్స్ పేర్లు కూడా తెలియదని అధికారులే చెప్తున్నారు.

అయితే, విద్యార్థుల నుంచి ప్రాక్టికల్స్ లో మార్కులు వేయిస్తామంటూ కాలేజీలే నేరుగా స్టూడెంట్ల నుంచి బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇదంతా తెలిసినా ఇంటర్ బోర్డు అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి అప్పట్లో ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో.. ఇలాంటి చర్యలపై సర్కారు సీరియస్​గా ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.