నీతులు చెప్పే ముందు ఆచరించండి..మ్యూనిచ్ సదస్సులో జైశంకర్ ఫైర్

నీతులు చెప్పే ముందు ఆచరించండి..మ్యూనిచ్ సదస్సులో జైశంకర్ ఫైర్
  • గ్లోబల్ డెమోక్రసీపై పశ్చిమ దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నయ్  
  • మ్యూనిచ్ సదస్సులో జైశంకర్ ఫైర్ 

మ్యూనిచ్: గ్లోబల్  డెమోక్రసీపై పశ్చిమ దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్  ఫైర్  అయ్యారు. తమ దేశాల్లో ఒకటి చేసి, వేరే దేశాల్లో మరొకటి బోధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంపై నీతులు బోధించే ముందు ఆచరించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని యూఎస్  సెనేటర్  ఎలిసా స్టాట్కిన్  చేసిన వ్యాఖ్యలకు తాను ఏకీభవించనని అన్నారు.  

భారత్ లో తామంతా అద్భుతంగా ఓటు వేస్తున్నామని ఆయన తెలిపారు. జర్మనీలోని మ్యునిచ్  సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో నిర్వహించిన ఓటుహక్కు కార్యక్రమంలో జైశంకర్  మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా సెనేటర్  కల్పించుకుంటూ అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. జైశంకర్  స్పందిస్తూ అలా ఏం లేదని, ఇండియాలో ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసినపుడు తన చూపుడు వేలిపై ఉన్న గుర్తును ఆయన చూపారు.

‘‘నా ఎడమ చేయి చూపుడు వేలిపై ఉన్న సిరా గుర్తును చూడండి. ఇటీవలే ఇండియాలోని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసిన సందర్భం ఇది. గత సంవత్సరం కూడా మా దేశంలో లోక్ సభ ఎన్నికల్లో కొన్ని కోట్ల మంది ఓటువేశారు. అర్హులైన 90 కోట్ల మంది ఓటర్లలో 70 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అన్ని కోట్ల ఓట్లను మేము ఒక్కరోజులోనే లెక్కిస్తాం. 

కాబట్టి, అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న మీ (యూఎస్  సెనేటర్) వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఐయామ్ సారీ” అని జైశంకర్ వ్యాఖ్యానించారు. అలాగే, ప్రజాస్వామ్యం అన్నం పెట్టదని అమెరికా సెనేటర్  చేసిన వ్యాఖ్యకూ జైశంకర్  గట్టి కౌంటర్  ఇచ్చారు. ప్రధాన్ మంత్రి గరీబ్  కల్యాణ్ అన్నా యోజన కింద ఇండియాలో 80 కోట్ల మందికి ఆహారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. అమెరికా సెనేటర్  చెప్పింది తప్పు అని ఆయన చురకలంటించారు.