హైదరాబాద్,వెలుగు: బెంగాల్‌లో మహిళలపై అఘాయిత్యాలకు పరోక్షంగా కారణమవుతున్న ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి డిమాండ్ చేశారు. బెంగాల్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయని, మహిళా సీఎం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్య బాధాకరమని, ఈ కేసు దర్యాప్తులో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కేసును సీబీఐకి బదిలీ చేయడానికి చాలా ఆలస్యం చేశారని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్వీసుభాష్, రాణిరుద్రమ, మురళీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.