ఎలాంటి పూచీకత్తు లేకుండా.. ముద్రా కింద 52 కోట్ల మందికి రుణాలు

ఎలాంటి పూచీకత్తు లేకుండా.. ముద్రా కింద 52 కోట్ల మందికి రుణాలు
  • ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.33 లక్షల కోట్లకు పైగా పంపిణీ: మోదీ
  • ఈ స్కీమ్​తో పెరిగిన ఆంత్రప్రెన్యూరియల్​ స్కిల్స్ 
  • పీఎంఎంవై స్కీమ్​కు పదేండ్లు..
  • తన నివాసంలో లబ్ధిదారులతో మోదీ సమావేశం

న్యూఢిల్లీ: దేశంలో ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం (పీఎంఎంవై) నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ స్కీమ్ కింద ఇప్పటివరకూ 52  కోట్ల మందికి రుణాలు ఇచ్చినట్టు తెలిపారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 33 లక్షల కోట్లకు పైగా విలువైన రుణాలను పంపిణీ చేసినట్టు వివరించారు. ఈ పథకంతో చాలామందిలో ఆంత్రప్రెన్యూరియల్​ స్కిల్స్​ పెరిగినట్టు చెప్పారు. పీఎంఎంవై స్కీమ్​ ప్రారంభమై పదేండ్లయిన సందర్భంగా  మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో లబ్ధిదారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. తన ఇంటికి వచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ధనవంతుల కోసమే అని పత్రికల్లో రాస్తుంటారని, కానీ.. దేశంలోని అందరు ధనవంతులను కలిపినా రూ.33 లక్షల కోట్ల సంపద కాదని అన్నారు. ముద్రా స్కీమ్​అనేది దేశంలోని సామాన్య ప్రజలకు లభించిన మంచి అవకాశమని చెప్పారు. 

రుణాలు తీసుకున్నవారిలో మహిళలే అధికం

ముద్రా రుణాల్లో మహిళలే ముందంజలో ఉన్నారని, ఎక్కువగా రుణాలు తీసుకోవడమే కాదు.. తిరిగి చెల్లించడంలో కూడా వారు ముందువరుసలో ఉంటున్నారని మోదీ తెలిపారు. ‘‘ముఖ్యంగా ముద్రా లబ్ధిదారుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గానికి చెందినవారు కావడం, 70% కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలు కావడం చాలా సంతోషకరమైన విషయం” అని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ఈ పథకం ఎంతో దోహదం చేసిందని తెలిపారు. రుణాలు తీసుకున్నవారు ఉద్యోగార్థులుగా ఉండకుండా.. ఉద్యోగ ప్రదాతలుగా మారారని చెప్పారు. ఒకరికి ఒకరు, ఇద్దరికి ఇద్దరు, కొందరు వందలు, వేలల్లో మందికి ఉద్యోగాలు కల్పించారని వివరించారు. ఈ స్కీమ్​ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలిచే భారీ కార్యక్రమంగా మారిందని చెప్పారు. ముద్రా రుణాల పరిధిని ప్రారంభంలో రూ.50వేల నుంచి రూ. 5 లక్షల వరకు విస్తరించి, ఇప్పుడు రూ.20 లక్షలకు పెంచామని తెలిపారు.

దుబాయ్​ క్రౌన్​ ప్రిన్స్​తో మోదీ భేటీ​

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన రెండు రోజుల  పాటు దేశంలో పర్యటిస్తున్నారు.  ఢిల్లీలో ఆయన ప్రధాని మోదీతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా మోదీ ఎక్స్​లో పోస్ట్ పెట్టారు. ‘‘దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అల్ మక్తూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సందర్శన ఒక ముఖ్యమైన అడుగు. మా ద్వైపాక్షిక సంబంధాలను ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో మరింత లోతుగా విస్తరించే అవకాశాలపై చర్చించాం” అని మోదీ పేర్కొన్నారు.