Praful Desai: చిక్కుల్లో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్.. నెటిజన్ల ట్రోలింగ్.. ఈ ఫొటోలే కారణం..!

Praful Desai: చిక్కుల్లో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్.. నెటిజన్ల ట్రోలింగ్.. ఈ ఫొటోలే కారణం..!

కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్పై సోషల్ మీడియాలో దుమారం రేగింది.  యూపీఎస్సీని మోసం చేసి ఉద్యోగం సంపాదించారని నెటిజన్లు విమర్శల దాడికి దిగారు. ఈ విమర్శలకు కారణం ఏంటంటే.. దివ్యాంగుల కోటాలో ప్రపుల్ దేశాయ్ అర్హత సాధించారు. అయితే.. ప్రుపుల్ దేశాయ్ ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ, బ్యాడ్మింటన్ ఆడుతూ ఫొటోలు వైరల్ అవడంతో రచ్చ మొదలైంది. దివ్యాంగుడైన ప్రపుల్ దేశాయ్కు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా  సాధ్యం అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. జీవితంతో పోరాడుతున్నానని అడిషనల్ కలెక్టర్ బదులిచ్చారు. ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ నెటిజన్లకు సూటిగా చెప్పారు. 

యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ చిక్కుల్లో పడ్డారు. ఆమె ట్రైనింగ్ను నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఇదే తరుణంలో ప్రపుల్ దేశాయ్ ఫొటోలు వైరల్ కావడం గమనార్హం. దివ్యాంగుల కోటాను (OH Quota) వాడుకుని దొడ్డిదారిలో ప్రపుల్ దేశాయ్ ఐఏఎస్గా చలామణీ అవుతున్నారని కొందరు నెటిజన్లు ట్విటర్లో తీవ్రంగా తప్పుబట్టారు. అర్హులైన ఎంతో మంది ఆకాంక్షలను ఇలాంటి వాళ్లు చిదిమేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ప్రపుల్ దేశాయ్ ఫొటోలు వివాదానికి కేంద్ర బిందువుగా మారడంతో సోషల్ మీడియా యూజర్ అయిన ఒక యువతి ప్రపుల్ దేశాయ్ ఫొటోలను షేర్ చేసి వివరణ కోరారు. 

2019 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ప్రపుల్ దేశాయ్ అనే మీరు ఈడబ్ల్యూఎస్, ఆర్ధోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ (Orthopedically handicapped) కేటగిరీలో ఉద్యోగం తెచ్చుకున్నారని ఆధారాలతో సహా ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మీరు సైక్లింగ్ చేస్తున్న, టెన్నిస్ ఆడుతున్న, గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలు ట్విటర్లో షేర్ అవుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు పబ్లిక్గా కనిపిస్తున్నాయని, సరిగ్గా ఇదే సమయంలో ఉన్నట్టుండి మీరు మీ అకౌంట్ను ప్రైవేట్లో మార్చేశారని ప్రపుల్ దేశాయ్కు ఆమె గుర్తుచేశారు. మీరు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 

Also Read :- ప్యాకెట్లలో పురుగులు..కస్టమర్ షాక్

యూపీఎస్సీ పారదర్శకతపై సందేహం కలిగే పరిస్థితి తీసుకురాకుండా అనుమానాలను నివృతి చేయాలని ఆమె కోరారు. ఎంతో మంది కష్టపడి అహర్నిశలు శ్రమిస్తూ తమ కలలను నిజం చేసుకోవాలని చూస్తున్న అభ్యర్థులకు దయచేసి సమాధానం చెప్పాలని ప్రుపుల్ దేశాయ్ ను ఈ సోషల్ మీడియా యూజర్ కోరారు. ఈ ట్వీట్ పై ప్రపుల్ దేశాయ్ స్పందించారు. వైరల్ అవుతున్న ఫొటోలన్నీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగమైనవని, దివ్యాంగుడినైన తాను ఆ పరిస్థితులను అధిగమించి అందరిలా జీవనం సాగించేందుకు ప్రయత్నించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తన ఫొటోలు వైరల్ కావడంతో వార్తల్లో నిలిచి వివాదంలో చిక్కుకున్నారు.