
- నాయకులకు ఉగ్రదాడి మృతుడి భార్య ప్రగతి జగ్దాలే విజ్ఞప్తి
పుణే: పహల్గాం దాడిని రాజకీయం చేయొద్దని ఉగ్రదాడి మృతుడి భార్య ప్రగతి జగ్దాలే కోరారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమె రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్‌లోయలో ఈ నెల 22న టెర్రరిస్టులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ అటాక్‌లో పుణెకు చెందిన సంతోష్ జగ్దాలే కూడా మృతిచెందారు. ఆయన భార్య ప్రగతి జగ్దాలే, కూతురు దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, సోమవారం మహారాష్ట్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు వడెట్టివార్ మాట్లాడుతూ.. ‘‘టెర్రరిస్టులు పర్యాటకుల మతం అడిగి చంపారని చెబుతున్నారు.
వారికి పర్యాటకుల వద్దకు వెళ్లి వారి చెవుల్లో గుసగుసలాడి.. వారి మతం ఏంటో తెలుసుకొనేంత సమయం ఉందా? టెర్రరిస్టులకు కులం, మతం ఏమీ ఉండవు”అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి. దీంతో మంగళవారం ప్రగతి జగ్దాలే ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. పహల్గాం విషాదాన్ని రాజకీయం చేయొద్దని, తమ భావోద్వేగాలతో ఆడుకో వద్దని నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఆ దాడిలో ప్రాణాలతో బయటపడిన వారు భయానకతను ప్రత్యక్షంగా అనుభవించారని చెప్పారు.