విక్రమ్ ల్యాండర్ దిగిన నాలుగు గంటల తర్వాత రాత్రి 10 గంటలకు ల్యాండర్ లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్ ర్యాంప్ మీదుగా నెమ్మదిగా కిందకు దిగి చంద్రుడి నేలపైకి చేరింది. రోవర్ కిందకు దిగుతుండగా ల్యాండర్ తీసి పంపిన ఫొటోను కూడా ఇస్రో ట్వీట్ చేసింది. ల్యాండింగ్ కు ముందు చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ క్లిక్ మనిపించిన ఫొటోలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
చంద్రుడిపై ల్యాండర్ దిగిన వెంటనే భారీ ఎత్తున దుమ్ము ధూళి చెలరేగుతుంది. అక్కడ గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం వల్ల భూమిపై మాదిరిగా డస్ట్ వెంటనే నేలపైకి పడిపోదు. డస్ట్ వల్ల రోవర్ కెమెరాలు, పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉండటం వల్లే ల్యాండర్ దిగిన నాలుగు గంటల తర్వాత డస్ట్ నేలకు పడిపోయి క్లియర్ అయ్యాకే రోవర్ బయటకు వచ్చేలా ఇస్రో సైంటిస్టులు కమాండ్స్ ఇచ్చారు.