- ఇది ఈ మిషన్కే హైలైట్ అంటూ ఇస్రో ట్వీట్
- ఆదిత్య–ఎల్1 రిహార్సల్ పూర్తి.. ఎల్లుండే ప్రయోగం
బెంగళూరు: చందమామ దక్షిణ ధ్రువంపై రాళ్లు రప్పలను, గుంతలను తప్పించుకుని జాగ్రత్తగా తిరుగుతూ అక్కడి మట్టిని స్టడీ చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ఈ మిషన్ కే హైలైట్ గా నిలిచే ఓ అద్భుతమైన ఫొటో తీసింది. జాబిల్లిపై నిటారుగా నిలబడి ఉన్న విక్రమ్ ల్యాండర్ కు ఎదురుగా వెళ్లి దానిని తన ముందువైపు ఉన్న నావిగేషన్ కెమెరాలతో రోవర్ క్లిక్ మనిపించింది. బుధవారం ఉదయం 7.35 గంటలకు రోవర్ ఈ ఫొటోను తీసి పంపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది.
స్మైల్ ప్లీజ్’ అంటూ క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేసింది. ఫొటోలో విక్రమ్ ల్యాండర్ బ్లాక్ అండ్ వైట్ లో నిటారుగా నిలబడి ఉంది. ఒకవైపు నుంచి ఎండ పడుతుండగా.. మరోవైపున ల్యాండర్ నీడ కన్పిస్తోంది. అదేసమయంలో ల్యాండర్ లోని అతి కీలకమైన చాస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్ పరిమెంట్) పరికరం డ్రిల్లింగ్ చేస్తున్న దృశ్యం కూడా ఫొటోలో చూడొచ్చు. ల్యాండర్ కు మరోవైపున ఇల్సా(ఇన్ స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ) అనే మరో కీలక పరికరం కూడా పైనుంచి తీగల సాయంతో చంద్రుడి ఉపరితలానికి ఆనుకుని ఉండటం కూడా ఫొటోలో కన్పిస్తోంది. అందుకే దీనిని ‘ఇమేజ్ ఆఫ్ ద మిషన్’ అంటూ ఇస్రో పేర్కొంది.
రెండు కెమెరాలే.. రెండు కండ్లు
చంద్రుడిపై ఎదురుగా ఉన్న రాళ్లు రప్పలను, గుంతలను, అడ్డంకులను గుర్తించి.. దారి మార్చుకుంటూ సేఫ్ గా తిరిగేందుకు రోవర్ కు ముందు వైపున పైభాగంలో ఉన్న రెండు నావిగేషన్ కెమెరాలే రెండు కండ్ల మాదిరిగా పని చేస్తున్నాయి. బెంగళూరులోని ఇస్రో ల్యాబ్ (ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్–ఎల్ఈఓఎస్) సైంటిస్టులు రూపొందించిన ఈ కెమెరాలు తీసిన ఫొటోల వల్లే రోవర్ ను భారీ గుంతలో పడకుండా దారిమళ్లించి కాపాడగలిగారు. తాజాగా ల్యాండర్ ఫొటోను కూడా అద్భుతంగా తీసి పంపడం ద్వారా ఈ కెమెరాలు తమ పనితీరును చాటాయి.
ఇస్రోకు, రోవర్ కు నో కనెక్షన్
రోవర్ తాను తీసే ఫొటోలను, సాయిల్ టెస్టులు చేసి విశ్లేషించే డేటాను ఇస్రోకు నేరుగా పంపలేదు. ఇది ల్యాండర్ కు పంపితే.. ల్యాండర్ వాటిని ఇస్రో కు ఫార్వర్డ్ చేస్తోంది. నిజానికి ఇస్రోకు, రోవర్ కు మధ్య నేరుగా ఎలాంటి కనెక్టివిటీ లేదు. ఇది ఫొటో లను అయినా, డేటాను అయినా ల్యాండర్ కే పంపగలదు. ల్యాండర్ నుంచి మాత్రమే కమాండ్స్ అందుకోగలదు. అంతేకాదు 500 మీటర్ల దూరం దాటితే దీనికి ల్యాండర్ తో సిగ్నల్స్ కట్ అవుతాయి. అందుకే ల్యాండర్ చుట్టూ 500 మీటర్లు దూరంలోపే రోవర్ తిరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
డ్రిల్లింగ్ పనిలో విక్రమ్
ప్రజ్ఞాన్ రోవర్ తీసిన ఫొటోలో విక్రమ్ ల్యాండర్ పనిలో నిమగ్నమైన దృశ్యం కూడా రికార్డ్ అయింది. ల్యాండర్ లోని చాస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్ పరిమెంట్) పరికరం మట్టిలోకి డ్రిల్లింగ్ చేస్తూ ఉండటం ఫొటోలో కనిపిస్తోంది. దీనిలో పై నుంచి కింది వరకూ 10 సెన్సర్లు ఉన్నాయి. ఇది నేలలోకి 10 సెంటీమీటర్ల వరకూ చొచ్చుకుపోయి.. పై నుంచి కింది వరకూ టెంపరేచర్ల తేడాను కొలుస్తుంది. ఇప్పటికే చంద్రుడి దక్షిణ ధ్రువం థర్మల్ ప్రొఫైల్ ను తొలిసారిగా ఇది మనకు పంపింది. కంటిన్యూగా పని చేస్తూ టెంపరేచర్లను రికార్డ్ చేస్తోంది.
అలాగే ఉపరితలంపై పడి ఉన్నట్లుగా కనిపిస్తున్న ఇల్సా(ఇన్ స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ) పరికరం ల్యాండింగ్ సైట్ లో వస్తున్న ప్రకంపనలను గుర్తించే పనిలో ఉంది. ఇది పంపే డేటాతో చంద్రుడి ఉపరితలం (క్రస్ట్), దాని కింద ఉన్న మాంటిల్ పొరల నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకునేందుకు వీలుకానుంది. ల్యాండర్ లో వీటితో పాటు ప్లాస్మా సాంద్రతను గుర్తించే లాంగ్మూర్ ప్రోబ్, నాసాకు చెందిన లేజర్ రిట్రోరిఫ్లెక్టర్ అర్రే అనే పేలోడ్లు కూడా ఉన్నాయి. ఇక మట్టిని విశ్లేషించి అందులోని మూలకాలను గుర్తించేందుకు రోవర్ లో లిబ్స్, ఏపీఎక్స్ఎస్ అనే పేలోడ్లు పనిచేస్తున్నాయి.
ఆదిత్య ప్రయోగం ఎల్లుండే
సూర్యుడిపై అధ్యయనం కోసం చేపట్టిన ఆదిత్య – ఎల్1 మిషన్ కు సంబంధించిన లాంచ్ రిహార్సల్, రాకెట్ అంతర్గత తనిఖీలు బుధవారం పూర్తయ్యాయని ఇస్రో వెల్లడించింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ–సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపింది. సూర్యుడికి, భూమికి మధ్య అంతరిక్షంలో ఉన్న లాగ్రేజియన్ పాయింట్(ఎల్1) వద్దకు ఆదిత్య ఉపగ్రహాన్ని పంపనున్నారు.
ఇది 4నెలలు అంతరిక్షంలో ప్రయాణించి మనకు 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న ఎల్1 ప్రదేశానికి చేరుకోనుంది. అక్కడి నుంచి సూర్యుడి కరోనాను, సోలార్ విండ్స్ ను స్టడీ చేస్తూ ఒక స్పేస్ అబ్జర్వేటరీ మాదిరిగా పని చేయనుంది. అబ్జర్వేటరీలో 7పేలోడ్లు ఉంటాయి. ఇవి సూర్యుడి వెలుపలి పొరలు అయిన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాను వేర్వేరు వేవ్ బ్యాండ్స్ లలో స్టడీ చేయనున్నాయి.