ప్రేగ్: ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో చివరి రెండు రౌండ్ గేమ్స్‌ను డ్రాగా ముగించాడు. గురువారం డేవిడ్ నవారా (చెక్)తో జరిగిన ఆఖరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. తెల్లపావులతో ఆడిన తమిళనాడు ప్లేయర్ విజయం కోసం చివరి వరకు ప్రయత్నించాడు.
కానీ డేవిడ్ కీలక ఎత్తులతో ప్రజ్ఞానందకు చెక్ పెట్టాడు. అంతకుముందు మాటెస్జ్ బార్టెల్ (పోలెండ్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ కూడా డ్రా అయ్యింది. ఓవరాల్‌గా ప్రజ్ఞానంద 5 పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్‌తో టోర్నీని ముగించాడు. పర్హామ్ పాగిసుడ్లో (ఇరాన్)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్న డి. గుకేశ్.. విన్సెంట్ కీమర్ (జర్మనీ)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో నెగ్గాడు. చివరకు 4.5 పాయింట్లతో నిలిచాడు. రిచర్డ్ రాపోర్ట్ (రొమేనియా), కీమర్‌తో జరిగిన మరో గేమ్‌లను విదితి గుజరాతీ (3) డ్రా చేసుకున్నాడు. మరోవైపు షెన్‌జెన్ మాస్టర్స్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి ఏడో రౌండ్‌లో.. దుబోవ్ డానిల్ (రష్యా)తో జరిగిన గేమ్‌ను 31 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్ తర్వాత అర్జున్ 4.5 పాయింట్లతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.