
హైదరాబాద్, వెలుగు: కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన తత్వవేత్త, దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పూలే ఆలోచన విధానాన్ని, ఆశయాలను తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం పూలేను స్మరించుకుంటూ ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా పేరు పెట్టుకుందన్నారు.
శుక్రవారం పూలే 198వ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం నివాళులు అర్పించారు. దేశానికి జ్యోతిబా పూలే అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
దేశంలో అట్టడుగు వర్గాలపై జరుగుతున్న దాష్టికాలపై పోరాటం చేసిన వ్యక్తి పూలే అని అన్నారు. భార్య సావిత్రిబాయి సహకారంతో తన జీవితాన్ని పోరాటం, సంస్కరణలకు అంకితం చేసిన మహోన్నతుడని గుర్తుచేశారు. విద్యకు పూలే ఇచ్చిన ప్రాధాన్యతతో వెనుబడిన తరగతులకు గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం దేశానికే దిక్సూచిగా రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసిందని తెలిపారు.