రైతులు కోటీశ్వరులయ్యారా ?

రైతులు కోటీశ్వరులయ్యారా ?

మక్తల్/నర్వ : ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని వైఎస్సార్‌‌టీపీ చీఫ్​షర్మిల విమర్శించారు. రుణమాఫీ చేస్తానని రైతులను, ఉద్యోగాలు ఇస్తానని విద్యార్థులను ఆగం చేయడం తప్ప రాష్ట్రంలో సీఎం చేసిందేమీ లేదని ఆమె నిప్పులు చెరిగారు. ఆదివారం నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండల కేంద్రంతో పాటు మండలంలోని యాంకి, పెద్ద కడ్మూర్, ఎల్లంపల్లి గ్రామాల్లో షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగించారు. ఎల్లంపల్లిలో ఏర్పాటు చేసిన మాటా ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దళితులకు మూడెకరాలు, పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్.. దళితులను, ఆదివాసీ, గిరిజనులను మోసం చేశారన్నారు.

కేసీఆర్ హయాంలో ఆర్టీసీ, కరెంట్ చార్జీలు మూడింతలు పెరిగాయని గుర్తుచేశారు. కేవలం రైతు బంధు ఇచ్చి అన్ని పథకాలు రద్దు చేసిన సీఎం.. రైతులు కోటీశ్వరులవుతున్నారనడం దారుణమన్నారు. తెలంగాణలో కౌలు రైతు అసలు రైతు కాదనడం దుర్మార్గమని షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కార్డు ఉన్నవారికి కూడా దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తూ మిగతా సరుకులు ఆపేసిన సర్కార్‌‌ కేసీఆర్​దేనన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆరాచకాలను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ లేదని, అందుకే పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. తనను ఆశీర్వదిస్తే వ్యవసాయాన్ని పండుగ చేస్తానని, మహిళ పేరు మీద పక్కా ఇల్లు ఇస్తానన్నారు. నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాలు కల్పించే ఫైల్​మీదే తన తొలి సంతకం ఉంటుందన్నారు. అంతకుముందు నర్వ మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న దీక్ష వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు.