రోడ్ల మీదే పార్కింగ్ పెద్దపల్లిలో ట్రాఫిక్ కష్టాలు
పెద్దపల్లి, వెలుగు: జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాజీవ్ రహదారిని ఆనుకుని రంగంపల్లి నుంచి శాంతినగర్వరకు దాదాపు రెండు కిలో మీటర్ల మేర వ్యాపార సముదాయాలున్నాయి. ఈరహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సిటీ వెహికల్స్‌తో రద్దీగా ఉంటుంది. రాజీవ్‌రహదారి పక్కన షాపుల ముందు పార్కింగ్‌స్థలం లేక తమ వెహికల్స్‌ను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు.
సెల్లార్లు లేకుండా భవన సముదాయాలు..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాజీవ్‌రహదారికి ఇరువైపులా ఏ భవనానికి సెల్లార్లు ఉండడం లేదు. అక్కడక్కడా కనిపించినా అందులోనూ దుకాణాలు నడుపుతున్నారు. ఫుట్ పాత్లను కూడా వ్యాపారులు ఆక్రమించుకుని వస్తువులు, బోర్డులు పెట్టడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పట్టణంలో రాజీవ్ రహదారిని ఆనుకొని మద్యం షాపులు, బార్లు నడుస్తున్నాయి. అక్కడే ఆటో స్టాండ్ఉండడంతో కాలు తీసి కాలు పెట్టే సందు ఉండడం లేదు. పెరిగిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్ల వద్ద పెయిడ్ పార్కింగ్లు, ఆటో స్టాండ్లుఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పేరొక చోట.. రీచ్ మరోచోట
ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు సుల్తానాబాద్, వెలుగు: టెండర్ అయిన ఇసుక రీచ్ ఒక గ్రామానికి చెందినది కాగా, కాంట్రాక్టర్ మరోచోట ఇసుక రీచ్ నిర్వహిస్తుండటంతో గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. సుల్తానాబాద్, ఓదెల మండలాల్లోని మానేరు వాగు నుంచి ఇసుక తరలింపునకు ఇటీవల ప్రభుత్వం ఇసుక రీచ్ లకు టెండర్లు నిర్వహించింది. ఇందులో ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామ శివారులో రెండు రీచ్ లు ఏర్పాటయ్యాయి. గుండ్లపల్లి 2వ నంబర్ రీచ్ ను కాంట్రాక్టర్ వాగు పక్కనే ఉన్న సుల్తానాబాద్ మండలం మంచిరామి శివారులో నిర్వహిస్తున్నాడు. మంచిరామి శివారులోకి వచ్చే వాగు ప్రదేశం నుంచి ఇసుకను తోడి ఇదే గ్రామ శివారులోని పలు ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అయితే తమ గ్రామ శివారు నుంచి ఇసుకను తోడడంపై మంచిరామి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇసుక తరలింపువల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నుంచి సీనరేజ్ చార్జీల కింద జీపీకి 25 శాతం ఆదాయం జమ అవుతుంది. ఇసుకను తమ శివారు నుంచి తీసుకువెళ్లి సీనరేజ్ చార్జీలను మాత్రం గుండ్లపల్లి పంచాయతీకి జమ చేయడమేంటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇసుక రీచ్ నిర్వహణకు అభ్యంతరం లేదని, రీచ్ తమ పంచాయతీ పేర మార్చాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టి సర్పంచ్ రాజమల్లు ఆధ్వర్యంలో ఇసుక డంపింగ్ ను అడ్డుకున్నారు. రీచ్ ను తమ గ్రామ పంచాయతీ పేరిట మార్చే వరకు ఇసుకను తరలించొద్దంటూ రీచ్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో నిర్వాహకులు లారీలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
అమ్మవారి దయతో సంగ్రామ యాత్ర
జగిత్యాల,వెలుగు: అమ్మవారి దయతో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను కోర్టు ఆదేశాల మేరకు కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చిన అనంతరం సొమవారం నిర్మల్ వెలుతుండగా జగిత్యాల వద్ద బీజేపీ లీడర్లు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ మొదట సభ నిర్వహించుకోవడానికి అనుమతిచ్చి తర్వాత అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్వక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర సక్రమంగా కొనసాగితే సీఏం కేసీఆర్ పై ప్రజలు తిరుగుబాటు చేస్తారని, ప్రభుత్వం ఉంటుందో పోతుందో అనే భ్రమలో పడ్డారని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేసి పాదయాత్రను ప్రారంభిస్తామని తెలిపారు.
కరీంనగర్: కోర్టు తీర్పు మేరకు పాదయాత్ర నిర్వహిస్తామని యాత్ర ఇన్ చార్జి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం పాదయాత్రపై కోర్టు తీర్పు వచ్చిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అవినీతినీ, కుటుంబ పాలన ఎండగడుతూ ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుంటే యాత్రను ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. భైంసా యాత్ర గురించి 10 రోజులు ముందే డీజీపీ, స్థానిక కమిషనరేట్ లో పోలీస్ పర్మిషన్ గురించి దరఖాస్తు ఇచ్చామన్నారు. ఆదివారం చివరి క్షణంలో యాత్ర అనుమతి రద్దు చేస్తున్నట్లు పోలీసులు వాట్సప్ మెసేజీ పంపడం ఆశ్యర్యంగా ఉందన్నారు.
కొడిమ్యాల: మండలంలోని పూడూరు స్టేజీ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కొడిమ్యాల బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఐదో విడత ప్రజా సంగ్రామయాత్ర లో భాగంగా నిర్మల్ జిల్లా బాసరకు వెళ్తున్న సందర్భంగా పటాకులు పేల్చి సంజయ్ కుమార్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టు అని అన్నారు. వారిలో బీజేపీ లీడర్లు ఏలేటి నరసింహారెడ్డి, చల్లా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల: బైంసాకు వెళ్తున్న ఎంపీ బండి సంజయ్‌కు కోరుట్లలో బీజేపీ లీడర్లు ఘన స్వాగతం పలికారు. సాయిబాబా ఆలయం వద్ద సంజయ్ కు స్వీట్తినిపించి సన్మానించారు. ప్రధాన చౌరస్తా ల వద్ద బాణా సంచా కాల్చి బైక్‌ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుల ఉమ, లీడర్లు నవీన్ కుమార్, మహేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మా భూములు మాకిప్పించండి
ఎమ్మెల్యేకు దళిత రైతుల వినతి
కోనరావుపేట,వెలుగు: తమ భూములు తమకు ఇప్పించాలని మండలంలోని నిమ్మపల్లికి చెందిన దళిత రైతులు సోమవారం ఆందోళన చేశారు. మండలంలోని వట్టిమల్ల శివారు సనుగుల రోడ్డుకు పక్కనగల సుమారు 72 ఎకరాలను 1995లో అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు 73 మంది దళిత రైతులకు పంపిణీ చేసి పట్టాలిచ్చారన్నారు. అప్పటి నుంచి భూములను సాగుచేసుకుంటూ జీవిస్తున్నామన్నారు. కొన్నేళ్లుగా ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లోకి తమను అనుమతించడంలేదని, పంటలను ధ్వంసం చేసి బెదిరిస్తున్నారని వాపోయారు. రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్పందించి భూములు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు డప్పుల చంద్రయ్య, మల్యాల కిష్టయ్య, డప్పుల ఎల్లయ్య, మల్యాల బొందయ్య, లస్మయ్య,కాంతవ్వ,లచ్చవ్వ, కమలవ్వ, రైతులు పాల్గొన్నారు.
కుట్రతో పబ్బం గుడుపుకుంటున్నరు
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య కుట్రలు, కుతంత్రాలు చేసి బీజేపీ పబ్బం గడుపుకోవడం తగదని మేయర్ సునీల్ రావు అన్నారు. సోమవారం నగరంలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ఫైర్ అయ్యారు. ప్రజల మద్య వైషమ్యాలు రెచ్చగొడితే సహించేదిలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. జిల్లాలో 13 ఎమ్మెల్యే సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఎంపిగా సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో కార్పొరేటర్ శ్రీనివాస్, వేణు, మాధవి పాల్గొన్నారు.
భైంసాకు వెళ్లడం రెచ్చగొట్టే చర్యే
జగిత్యాల: సున్నిత ప్రాంతమైన భైంసాలో బండి సంజయ్ సభ పెడితే ఉద్రేకాలు పెరుగుతాయని, ప్రభుత్వం అనుమతి ఇవ్వని సభకు సంజయ్ పోయే ప్రయత్నం చేయడం రెచ్చగొట్టే చర్య అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ భైంసా రాష్ట్రంలోనే అతి సున్నిత ప్రాంతమని అన్నారు. ప్రభుత్వం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. బండిని జగిత్యాల పరిధిలో అరెస్ట్ చేయడంతో ఇక్కడి వాతావరణం వేడెక్కిందని అన్నారు.
నాలుగేండ్లుగా నరకయాతన పడుతున్నం
మానకొండూర్, తిమ్మాపూర్, వెలుగు : నాలుగేండ్ల నుంచి రోడ్డేస్తామని ఆలస్యం చేస్తున్నారని, దీంతో అధ్వానమైన రోడ్డుపై ప్రయాణం చేయలేకపోతున్నామని మానకొండూరు నియోజకవర్గంలోని అన్నారం గ్రామస్తులు రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వచ్చేదాకా తాము ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానకొండూరు నుంచి అన్నారం మీదుగా జమ్మికుంట వరకు ఫోర్ లైన్ రోడ్డు పనులు మొదలుపెట్టి నాలుగేండ్లవుతోందని, ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంతో గుంతల రోడ్డుపై నరకయాతన పడుతున్నామన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గతంలో రాఘవపూర్ గ్రామస్థులు ధర్నా చేస్తే పనులు పూర్తి చేశారని, తామేం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవపూర్ నుంచి మానకొండూరు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. సుమారు మూడు గంటలపాటు బైఠాయించడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి నిరసన విరమింపజేశారు.