
హనుమకొండ సిటీ, వెలుగు: భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య వెనుక కేసీఆర్ ఉన్నారని ప్రచారం జరుగుతోందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, సీఎంగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని విమర్శించారు. గురువారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. సామాజిక కార్యకర్త, బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తిని పట్టపగలు దుండగులు చంపినా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అవినీతిని ప్రశ్నించినందుకే అతడిని మర్డర్ చేశారని, ఇందులో మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి దేశంలోనే పెద్ద స్కామ్ అని, కేసీఆర్ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై రాజలింగమూర్తి గతంలో భూపాలపల్లి జిల్లా కోర్టులో కేసీఆర్, హరీశ్ రావులపై కేసు వేశారని గుర్తు చేశారు. మృతుడి కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని పాల్ డిమాండ్ చేశారు.