తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాంతాచారి తండ్రి గెలిచి, మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెడతారని వెల్లడించారు. శ్రీకాంతాచారి అమరుడైన 2009 డిసెంబరు 3వ తేదీయే.. సిసలైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమన్నారు. ఇప్పటినుంచి ఆ రోజునే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రజలను కోరారు. గురువారం ఉదయం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబరు 3న శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ అమరుల కుటుంబాల కోసం ఉచిత విద్య, వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద నేతలు నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ల సహకారంతో తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తా’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలను అప్పుల ఊబి నుంచి రక్షించి అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రజాశాంతి పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రజాశాంతి పార్టీ కి ఓటు వేయాలని కోరారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా బలిదానం చేసుకోలేదని పేర్కొన్నారు. ఈసందర్భంగా శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి మాట్లాడుతూ.. అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులు జరపాలని కోరారు. రాష్ట్ర ప్రజల కోసం మరోసారి ఉద్యమం చేస్తామని.. ప్రజలకు న్యాయం జరిగినప్పుడే అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరుతుందని వెంకటాచారి అన్నారు.
మరిన్ని వార్తలు..