పాస్టర్ ప్రవీణ్​ది రాజకీయ హత్యే .. గాంధీలో రీపోస్టుమార్టం కోసం పోరాడతా : కేఏ పాల్​

పాస్టర్ ప్రవీణ్​ది రాజకీయ హత్యే .. గాంధీలో రీపోస్టుమార్టం కోసం పోరాడతా : కేఏ పాల్​
  • సికింద్రాబాద్​లో పాస్టర్​ ప్రవీణ్​అంత్యక్రియలు  

పద్మారావునగర్, వెలుగు: పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ నెల 25న అర్ధరాత్రి ఏపీలోని రాజమండ్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఆయనను హత్య చేశారని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. గురువారం సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ వద్దనున్న సెంటినరీ బాప్టిస్ట్​చర్చికి ప్రవీణ్​పార్థీవ దేహాన్ని క్రైస్తవుల సందర్శనార్థం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో క్రైస్తవులతో పాటు కేఏ పాల్, బ్రదర్​అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, రాజీవ్​సాగర్, సినీ నటుడు రాజాతో పాటు పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేఏ పాల్​మాట్లాడుతూ.. రాజమండ్రి ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐలతో తాను మాట్లాడానని, కానీ వారంతా అబద్ధాలే చెప్తున్నారన్నారు. 

‘ఒక మనిషి చనిపోతే 36 గంటల వరకు పోస్టుమార్టం చేయకుండా ఉంటారా? క్రైమ్ సీన్లు పాడవకుండా చూడాల్సిన బాధ్యత లేదా’ అని ప్రశ్నించారు. న్యాయం జరగకపోతే ఇక్కడి గాంధీ దవాఖానలో రీ పోస్టుమార్టం చేయించడానికి పోరాడతానన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రవీణ్ పాస్టర్ మరణంపై పూర్తి విచారణ జరపాలని, పోస్టుమార్టం నివేదిక వెల్లడించాలన్నారు. ప్రవీణ్ పాస్టర్ హత్య వెనుక రాజకీయ కారణాలున్నాయన్నారు. 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తన పదవికి రాజీనామా చేసి అసమర్థత పాలన నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సువార్త చెప్పేందుకు వెళ్తున్న ఆయనపై దాడి చేసి హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని పాస్టర్లు రాజేశ్, విలియం పాల్​ఆరోపించారు. అభిమానుల సందర్శన తర్వాత పరేడ్​గ్రౌండ్​పక్కనున్న సెయింట్ జాన్స్ సెమెట్రీలో ప్రవీణ్ అంత్యక్రియలు నిర్వహించారు.