నల్గొండ: అభివృద్ధి అంటే ఏంటో మునుగోడు నుంచే చూపిస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు. జిల్లాలోని గట్టుప్పల్ మండల కేంద్రంలో బుధవారం కేఏ పాల్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలయ్యిందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. రైతులు, యువకులు, విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. మోడీ పాలనలో కూడా ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఉచిత విద్య, వైద్యం, 7 వేల ఉద్యోగాలతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. మునుగోడులో మొదలయ్యే తమ అభివృద్ధి పాలన... రాష్ట్రమంతా వ్యాపింపజేస్తామని ధీమా వ్యక్తం చేశారు.