ప్రజాదర్బార్ షురూ! : సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్

ప్రజాదర్బార్ షురూ! : సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్

ఎప్పుడో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో  వైఎస్సార్ ప్రభుత్వం తర్వాత  సీఎం స్థాయి ప్రజా దర్బార్ బంద్ అయింది. గడిచిన పది ఏండ్ల తెలంగాణలోని కేసీఆర్ సర్కార్​లో  ఎక్కడాప్రజాదర్బార్ కానరాలేదు. అలాంటి ప్రజాదర్బార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన కొన్ని గంటల్లోనే మళ్లీ ప్రారంభం కానుంది.ప్రజాదర్బార్​పై  సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం విశేషం. రేవంత్​ సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం ప్రజా దర్బార్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మాజీ సీఎం కేసీఆర్  ప్రగతిభవన్ చుట్టూ ప్రజలకు అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తొలగించేశారు. దివంగత మాజీ  సీఎంలు ఎన్టీఆర్,  వైఎస్ఆర్  కాలంలో  సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు నివేదించుకునే అవకాశం ఉండేది. జిల్లాల పర్యటనకు సీఎం వచ్చినా ప్రజలను కలిసేవారు.  గ్రామ సభల్లో  వీలును బట్టి పాల్గొనేవారు. ఇప్పుడు అదే కాలం మళ్ళీ వచ్చింది.  ప్రజలు నేరుగా సీఎంను  కలిసి తమ సమస్యలు విన్నవించే అవకాశం లభించనుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునే మంచి పరిస్థితులు సీఎం రేవంత్ రెడ్డి ద్వారా పునరావృతం అయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్  పాలనలో  ఆయనను సొంతపార్టీ  ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలవడమే గగనం అయ్యేది.  ఇక ప్రజలను ఎన్నికలప్పుడో  లేదా ఏదో కార్యక్రమం సందర్భంగా తప్ప ఆయన కలిసిన దాఖలాలు లేవు. అందుకే అయన ఎన్నడూ ఊహించని పరిణామం ప్రజల నుంచి ఎదుర్కొన్నారు.  ప్రజల వద్దకు  సీఎం వెళ్లే  కార్యక్రమాలు లేకుండానే బీఆర్ఎస్​ పాలన ముగిసింది.

కేసీఆర్​ ఏకపక్ష పాలనకు అడ్డుకట్ట

కేసీఆర్​ ఏకపక్ష పాలన, అహంభావ విధానం ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్యగా మారిపోయింది. అలాంటి నిరంకుశ పాలనను ఎంతో  ధైర్యంతో  రేవంత్ రెడ్డి అడ్డుకున్నారు. రేవంత్  రాజకీయ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే అయనలో నిరంతరం జ్వలించే మనస్తత్వం కనిపిస్తుంది.  ఎన్ని కష్టాలు,  నష్టాలు వచ్చినా అయనలోని  రాజీపడని, న్యాయంవైపు నిలబడే వ్యక్తిత్వం స్పష్టం అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి  ఆత్మస్థైర్యం ఎక్కువే.  తుఫాన్ ఎదురుగా ఉందని తెలిసికూడా ఎదురెళ్లి  గెలిచాడు.  తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపాడు. ప్రజాదర్బార్  సీఎం స్థాయిలోనే  కాకుండా శాసన సభ్యుల స్థాయిలోనూ నిర్వహించాలి. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తన నియోజకవర్గంలో ప్రజాదర్బార్  నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. మండల, మున్సిపాలిటీ, నియోజకవర్గం స్థాయిలో ప్రజాదర్బార్ లు నిర్వహించేందుకు అయన ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రజాదర్బార్ ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో నిర్వహించడం ద్వారా సమస్యలు సత్వరంగా పరిష్కారం అవుతాయి.

ప్రజల వద్దకు పాలన

మరోవైపు ప్రజలకు, శాసన సభ్యులకు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది.  నేరుగా ప్రజల వినతిపైన స్వయంగా ఎమ్మెల్యే సదరు వ్యక్తికి తన లేఖ ద్వారా పరిష్కారం చేశారు అని చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి.  ప్రజల వద్దకు సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వంలో కలుగనున్నది.  ఈ ప్రజా దర్బార్లు  నిరంతరం కొనసాగాలి.  రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన కేవలం మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వమని,  ప్రజాపాలన అని రుజువు చేయాలి. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేవిధంగా  ప్రజాపాలన ఉండాలని ఆశిద్దాం.

- ఎండి మునీర్,
సీనియర్ జర్నలిస్ట్

 
 

Senior Journalist