- అభయహస్తం అప్లికేషన్ల స్వీకరణ
- పొద్దటి నుంచే తరలొచ్చిన జనం
- తొలిరోజు నిజామాబాద్‌లో 11,848,
- కామారెడ్డిలో 21,914 దరఖాస్తులు
- విజిట్ చేసిన ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్ హరిత
నిజామాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన గ్రామసభలకు తొలిరోజు జిల్లాలో అనూహ్య స్పందన వచ్చింది. గురువారం జిల్లాలోని 112 విలేజ్‌లు, ఆయా మున్సిపాలిటీల్లోని 146 వార్డుల్లో దరఖాస్తులు స్వీకరించారు. పొద్దున 8 గంటల నుంచే జనాలు క్యూ కట్టి దరఖాస్తులు అందించారు. ఫస్ట్ డే జిల్లాలో 11,848 దరఖాస్తులు వచ్చాయి. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అప్లికేషన్లు ఇచ్చారు. పొద్దున 8 నుంచి 12 వరకు, లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో అప్లికేషన్లు స్వీకరించారు.
దరఖాస్తుల పంపిణీ
ప్రజా పాలన జరిగే గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిల్లోని వార్డులు/డివిజన్ల సమాచారాన్ని ఆఫీసర్లు ముందుగానే ప్రజలందరికీ తెలిసేలా చాటింపులు వేయించారు. దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయించారు. ప్రజలు ఆరు గ్యారంటీలతో కూడిన అప్లికేషన్లో తమ వివరాలు పొందుపరిచి, రశీదులు తీసుకున్నారు. మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత కోసం ఆర్జీలే కాకుండా రేషన్‌కార్డు, ఇంటి జాగాల కోసం విడిగా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు.ఫారాలు నింపడానికి అంగన్వాడీ టీచర్లు, విద్యావంతులు, యువత, వాలంటీర్లు హెల్ప్ చేశారు.
ఆఫీసర్ల పర్యవేక్షణ
ప్రజాపాలన పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హరిత వచ్చారు. ఇందల్వాయి మండలం రంజిత్ నాయక్ తండా, డిచ్పల్లిలోని వెస్లీనగర్ తండా, నగర శివారులోని మాధవ్‌నగర్ లను ఆమె విజిట్ చేశారు. దరఖాస్తుదారులతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు నిజామాబాద్, మోపాల్ మండలాల్లో పర్యటించి వసతులు పరిశీలించారు. అడినల్కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నగర పాలక కమిషనర్ మంద మకరంద్ పరిశీలించారు. చేశారు. బోధన్, రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ తమ సెగ్మెంట్ లలో పాల్గొన్నారు. శుక్రవారం జిల్లాలోని 101 విలేజ్‌లలో ప్రజాపాలన నిర్వహించనున్నారు.
కామారెడ్డి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా గ్రామసభల నిర్వహణ గురువారం షురూ అయ్యింది. కామారెడ్డి జిల్లాలో ఫస్ట్ డే 54 గ్రామ పంచాయతీలు, 3 మున్సిపాలిటీల్లో గ్రామసభలు నిర్వహించారు. అభయహస్తం స్కీమ్‌ల కోసం ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. మొదటి రోజు జిల్లాలో 21,914 అప్లికేషన్లు వస్తే ఇందులో గ్రామాల్లో 17,001, 3 మున్సిపాలిటీల్లోని 80 వార్డుల్లో 4,913 అప్లికేషన్లు వచ్చాయి. సభలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అడిషనల్ కలెక్టర్ మనూచౌదరి, స్టేట్అబ్జర్వర్ హరిత పరిశీలించారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్‌రావు హాజరయ్యారు. ఆయా మండలాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ప్రత్యేక ఆఫీసర్లు, స్థానిక యంత్రాంగం పాల్గొన్నారు.
పొద్దటి నుంచే..
స్వీమ్ల కోసం అప్లికేషన్లు ఇవ్వడానికి గ్రామాల్లో ప్రజలు పొద్దటి నుంచే తరలివచ్చారు. గ్రామ పంచాయతీల వద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. అప్లికేషన్ల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. పంచాయతీ సెక్రెటరీలు, అంగన్వాడీ టీచర్లు అప్లికేషన్ ఫారాలు నింపి ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
అప్లికేషన్ ఫామ్‌లు లేక ఇబ్బందులు
పలు గ్రామాలకు అప్లికేషన్ ఫారాలు తక్కువగా వచ్చాయి. ఫార్మెట్ ప్రకారం అప్లికేషన్లు ప్రింట్ చేసి సప్లయ్ చేశారు. ఫస్ట్‌డే పలు చోట్ల ఫామ్స్ సరిపోలేదు. బిచ్కుందలో ప్రింటెండ్ అప్లికేషన్లు ఇవ్వాలని కోరుతూ స్థానికులు కొందరు పంచాయతీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఇంకా అప్లికేషన్లు వస్తాయని, ప్రతి ఒకరికి ఫారాలు ఇస్తామని, జనవరి 6 వరకు స్వీకరిస్తామని ఆఫీసర్లు నచ్చజెప్పారు.
అందరికీ సంక్షేమ ఫలాలు
ప్రజలకు చేరువగా పాలన అందించేందుకు ప్రభుత్వం ప్రజా పాలన చేపట్టిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి, సదాశివనగర్, గాంధారి, లింగంపేట మండలాల్లోని గ్రామాల్లో ఆయన స్టేట్ అబ్జర్వర్ హరిత, అడిషనల్కలెక్టర్ మనూ చౌదరితో కలిసి గ్రామసభల నిర్వహణను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అభయ హస్తం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అన్నీ పథకాలకు ఒకటే అప్లికేషన్ ఇస్తే సరిపోతుందన్నారు.