కామారెడ్డి, వెలుగు: ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలు 2వ రోజు బుధవారం కామారెడ్డి జిల్లాలో 178 చోట్ల జరిగాయి. ఇందులో గ్రామ సభలు 153, వార్డు సభలు 23 ఉన్నాయి. 2వ రోజు కూడా సభల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఇటీవల క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వివరాలను అధికారులు సభల్లో చదివి వినిపిస్తుండగా.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు, ఆత్మీయ భరోసా లిస్టుల్లో తమ పేర్లు ఎందుకు రాలేదంటూ పలుచోట్ల అధికారులను స్థానికులు ప్రశ్నించారు. తాడ్వాయి మండలం బ్రహ్మజివాడి గ్రామసభలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్పాల్గొన్నారు.
కాగా రేషన్‌కార్డు జాబితాలో పేర్లు రానివారు అధికారులను నిలదీశారు. పలుమార్లు అప్లికేషన్ ఇచ్చినప్పటికీ తమకు మంజూరు కాలేదన్నారు. పేర్లు రాని వారు మళ్లీ అప్లీకేషన్పెట్టాలని, రేషన్ కార్డుల జారీ నిరంతర పక్రియ అని కలెక్టర్వారికి వివరించారు. బీబీపేట మండలం తుజాల్పూర్లో ఇందిరమ్మ ఇండ్ల లిస్టుపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. అర్హులైన వారి పేర్లు లిస్టులో రాలేదంటూ ప్రజలు పేర్కొనటంతో కొద్ది సేపు గ్రామసభలో గందరగోళం నెలకొంది. నస్రుల్లాబాద్మండలంలో రైతు భరోసా లిస్టుపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన భూములకు తమకు గతంలో రైతుబంధు వచ్చిందని, ఇప్పడు సాగుకు యోగ్యంగా లేవని రైతు భరోసా నుంచి తొలగించడం ఏమిటని ప్రశ్నించారు.
బీర్కుర్మండలం బైరాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో అనర్హుల పేర్లు వచ్చాయంటూ స్థానికులు అభ్యంతరం తెలిపారు. రాజంపేట మండలం శివాయిపల్లిలో కూడా రేషన్ కార్డులో పేర్లు రాలేని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కామారెడ్డి మండలం శాబ్ధిపూర్, సదాశివనగర్మండలం తిర్మన్‌పల్లిలో అడిషనల్కలెక్టర్(రెవిన్యూ) వి.విక్టర్, పిట్లం మండలం మర్ధండ, జోజిగావ్గ్రామ సభల్లో అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) శ్రీనివాస్‌రెడ్డి, బాన్సువాడ టౌన్వార్డు సభల్లో సబ్ కలెక్టర్కిరణ్మయి పాల్గొన్నారు.
గ్రామసభల పేరిట కాంగ్రెస్ మోసం చేస్తోంది
బాల్కొండ, వెలుగు: గ్రామసభల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం వేల్పూర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే గ్రామ సభలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కాంగ్రెస్ లీడర్లు చెప్పిన వారికే రేషన్కార్డులు, ఇండ్లు ఇస్తే మరి సర్వేలు.. గ్రామ సభలు ఎందుకని ప్రశ్నించారు.
ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు,420 హామీలు ఇచ్చి100 రోజుల్లో ఇస్తానని గద్దెనెక్కారని, ఇప్పుడు ప్రజలను మండల ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. అప్లికేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత కాంగ్రెస్ హామీలపై నిలదీయాలన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, లీడర్లు పాల్గొన్నారు.