- స్కీమ్‌ల కోసం అప్లికేషన్ల స్వీకరణ
- ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధం
- నిజామాబాద్ జిల్లాలో 176, కామారెడ్డిలో 128 టీమ్స్
- ఐదు వేల కౌంటర్ల ఏర్పాటు
- నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ
కామారెడ్డి/ నిజామాబాద్, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన గ్రామసభలు ఇయ్యాల్టి (గురువారం) నుంచి షురూ కానున్నాయి. సభల్లో ప్రజల నుంచి స్కీమ్‌ల కోసం అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత స్కీమ్‌లకు అప్లికేషన్లు తీసుకొని ఆన్లైన్ చేయనున్నారు. వీటి నిర్వహణకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 1,056 గ్రామ పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలు, నిజామాబాద్కార్పొరేషన్పరిధిలో 7,57,033 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 304 టీమ్స్ పనిచేయనున్నాయి. ప్రతి వంద మందికి ఒక కౌంటర్ చొప్పున ఐదు వేల కౌంటర్లు ఏర్పాటు చేశారు.
మండలానికో స్పెషల్ ఆఫీసర్
ప్రజాపాలన గ్రామ సభల నిర్వహణ కోసం మండలానికో స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ప్రతి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో 2 టీములు ఉంటాయి. వీరి ఆధ్వర్యంలో రోజుకు 4 సభలు నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, పగలు 2 నుంచి 6 గంటల వరకు సభలు కొనసాగుతాయి. ఆయా గ్రామాల్లో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. పంచాయతీ సెక్రెటరీ, అంగన్వాడీ టీచర్ తదితరులు అప్లికేషన్లు స్వీకరిస్తారు.
మున్సిపాలిటీ ఏరియాల్లో వార్డు సభకు వార్డు ఆఫీసర్ఇన్చార్జ్గా వ్యవహరిస్తారు. అప్లికేషన్ నింపి దీనికి రేషన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్జతచేసి కౌంటర్లో ఇవ్వాలి. రేషన్‌కార్డు లేకుంటే ఆధార్‌కార్డును తప్పక అందించాలి. గ్రామ సభలు నిర్వహించే చోట టెంట్లు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీటి వసతి కల్పించాలని క్షేత్రస్థాయి ఆఫీసర్లకు ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించారు.
ప్రజాపాలన గ్రామ సభల నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో హైదరాబాద్‌లో మీటింగ్జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి సభల నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. జవాబుదారీగా పూర్తి పారదర్శకతతో వీటిని నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ప్రతి అర్హుడికి ఆరు గ్యారెంటీలు చేరాలన్నారు. ప్రజాపాలన విషయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సైతం పార్టీలను పక్కనబెట్టి ఆసక్తితో ఉన్నారు. పేదలకు మేలు చేసే సమాచారం గవర్నమెంట్‌కు చేరనున్నందున అన్ని సెగ్మెంట్లలో వారూ భాగస్వామ్యులు కానున్నారు. అప్లికేషన్లు నింపడానికి పార్టీ కార్యకర్తలను సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్‌గా క్రిస్టినా
ప్రజాపాలన పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లా నోడల్ఆఫీసర్గా సీనియర్ఐఏఎస్ఆఫీసర్ క్రిస్టినా జెడ్చోంగ్తూను నియమించారు. గతంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమెకు ఇక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉంది. ప్రజాపాలన ముగిసే దాకా ఆమె ఆఫీసర్లను మానిటరింగ్ చేయనున్నారు.
పకడ్బందీగా అప్లికేషన్ల స్వీకరణ
ప్రజాపాలన గ్రామ సభల్లో అప్లికేషన్ల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని కామారెడ్డి అడిషనల్కలెక్టర్(లోకల్ బాడీస్) మనూ చౌదరి సూచించారు. అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలన్నారు. బుధవారం ఆయన మండల స్థాయి ఆఫీసర్లతో టెలీ కాన్ఫరెన్స్‌నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలు కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం సభలు నిర్వహిస్తోందన్నారు. ఎలాంటి అలసత్వం వహించొద్దన్నారు. గ్రామ సభలపై డప్పు చాటింపు వేయించాలన్నారు. నిరక్షరాస్యులకు అప్లికేషన్లు నింపడానికి సెక్రెటరీ, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు సహకరించాలన్నారు.