గాంధీ భవన్​లో ప్రజాపాలన షురూ

గాంధీ భవన్​లో ప్రజాపాలన షురూ
  • హాజరైన మంత్రి దామోదర, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్​
  • 285కు పైగా అర్జీలు, 30 ఫిర్యాదులు అప్పటికప్పుడు పరిష్కారం

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ‘ప్రజా పాలన’ షురూ అయింది. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను మంత్రి స్వీకరించారు. ఉదయం12 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం  3.30 గంటల వరకు కొనసాగింది. 

ఇందులో వివిధ సమస్యలపై సుమారు 285 కు పైగా దరఖాస్తులు రాగా, 30 సమస్యలను మంత్రి దామోదర రాజనర్సింహ అప్పటికప్పుడు పరిష్కరించారు. ఇందులో ఎక్కువగా డబుల్ బెడ్ రూం ఇండ్లు, రేషన్ కార్డులు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ బదిలీలు, భూ వివాదాలు, వైద్య సేవలు, పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై అర్జీలు అందాయి. వైద్య, ఆరోగ్య శాఖ, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రితోపాటు పోలీసు కేసులకు సంబంధించిన వాటిపై మంత్రి దామోదర రాజనర్సింహ ఫోన్​లో  సంబంధిత అధికారులతో మాట్లాడి, పరిష్కరించారు. కేటీఆర్ తనపై రౌడీషీట్ ఓపెన్ చేశారంటూ సిరిసిల్లకు  చెందిన పార్టీ కార్యకర్త ఒకరు  మంత్రికి ఫిర్యాదు చేశారు. అన్నీ తప్పుడు కేసులేనని చెప్పడంతో మంత్రి దామోదర రాజనర్సింహ పోలీసు అధికారులతో మాట్లాడి, యువకుడికి న్యాయం చేయాలని కోరారు.  కాగా, ప్రారంభించిన మొదటి రోజే ప్రజాపాలనకు మంచి స్పందన వచ్చింది.

అబద్ధాలు కాంగ్రెస్ ​డీఎన్ఏలోనే లేవు: మంత్రి దామోదర

అబద్ధాలు, మోసం అనేవి కాంగ్రెస్ డీఎన్ఏలోనే లేవని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పార్టీ  కార్యకర్తలకు దగ్గర కావడానికి ప్రజా పాలన అద్భుతమైన కార్యక్రమం అని చెప్పారు. ఏ శాఖకు సంబంధించిన సమస్య​అయినా సరే పరిష్కరిస్తామని అన్నారు. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆలోచనతోనే ఈ ప్రజా పాలన ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 

ప్రజాపాలన నిరంతర ప్రక్రియ: మహేశ్ ​కుమార్​గౌడ్​

పార్టీలోని ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ గౌరవిస్తుందని పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్​ తెలిపారు. అందుకే వారి కోసం గాంధీ భవన్​లో ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు.  వారంలో ప్రతి బుధ, శుక్రవారాల్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుందని, దీనికి మంత్రులు హాజరవుతారని తెలిపారు. దీన్ని నిరంతర  ప్రక్రియగా కొనసాగిస్తామని చెప్పారు.