సింగరేణి వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు

సింగరేణి వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు
  •     డిసెంబర్ 4న పెద్దపల్లిలో ‘యువశక్తి’ సభ: సీఎండీ బలరామ్​
  •     సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అపాయింట్​మెంట్ లెటర్లు

హైదరాబాద్​, వెలుగు : సింగరేణి వ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అన్ని ఏరియాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రజా విజయోత్సవాల నిర్వహణపై సీఎండీ ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 4న పెద్దపల్లిలో నిర్వహించే యువశక్తి సభలో సీఎం, డిప్యూటీ సీఎంలతో తొమ్మిది వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. 

సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగాలు పొందిన 593 మందికి కూడా ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలనిఅధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్నారు. ప్రభుత్వ సహకారంతో అనేక కొత్త పథకాలను, కార్యక్రమాలను ప్రారంభించుకున్నట్లు చెప్పారు. ఏడాది కాలంలో 2,165 కొత్త ఉద్యోగాలను కల్పించామని, చరిత్రలోనే అత్యధికంగా 33 శాతం లాభాల బోనస్ ను కార్మికులకు పంపిణీ చేశామని తెలిపారు. 

సంస్థలో పని చేసే ఒక్కొక్కరికి రూ.1,90లక్షల వరకు లాభాల వాటా అందిందన్నారు. అలాగే తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు రూ.5వేల పంపిణీ చేశామన్నారు. గత ఏడాది పాలనలో సంస్థలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. దీపావళి బోనస్ (పి‌‌‌‌.ఎల్.ఆర్.ఎస్) ఒక్కొక్కరికి రూ.93,750 చెల్లించామనీ, ఇది గత ఏడాది కన్నా 50 కోట్లు అధికమన్నారు. ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు బ్లాక్ కోసం స్వయంగా డిప్యూటీ సీఎం ఆ రాష్ట్రానికి వెళ్లి అనుమతులు సాధించారనీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎండీతో పాటు డైరెక్టర్ జి.వెంకటేశ్వర్ రెడ్డి, జీఎంలు సుబానీ, రవి ప్రసాద్ పాల్గొన్నారు.