మనదేశంలో ప్రజాస్వామ్యం ఆయా సందర్భాలను, పరిస్థితులనుబట్టి పరిపక్వ–అపరిపక్వ స్థితిలో కనిపిస్తోంది. వ్యక్తులకు, నాయకులకు, పార్టీలకు, వ్యవస్థలకు తమకు అనుకూలంగా జరిగిన సందర్భంలో ప్రజాస్వామ్యం ఓ విశ్వరూప సందర్శనంలా కనిపిస్తోంది. తమకు వ్యతిరేకంగా ఫలితాలు పొందినప్పుడు ఇదే ప్రజాస్వామ్యం బూటకంగా, నాటకంగా దర్శనమిస్తోంది.
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో నిలబెట్టేటప్పుడు, ఎన్నికలు జరిగేటప్పుడు లేదా కొందరు నాయకులకు పదవులు లభించినప్పుడు జరిగే తతంగం ‘నాటకం’ అనేక వికృత వ్యాఖ్యానాలను మనముందు పెడుతోంది. తమకు లేదా వర్గానికి, కులానికి పదవులు రాగానే ఆయా వర్గాలు, కులాలు తరించిపోయినట్లు ప్రజాస్వామ్యం వల్లనే ఈ అద్భుతం జరిగినట్లు చెబుతుంటారు.
ఈ వెలుగు నీడల ప్రహసనం గురించి కాస్త విజ్ఞత ఉన్న ఎవరైనా ఆలోచించాల్సిందే. వ్యక్తులు తాము చేసే తప్పులను, తమ అవలక్షణాలను ప్రజాస్వామ్యం ముసుగులో దాచుకోవడం ప్రజాస్వామ్యం ఫెయిల్యూర్స్‌లో మొదటిమెట్టు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అన్న నీతివాక్యం ఎవరు పుట్టించారో తెలియదు
గానీ తెలంగాణ వచ్చాక పార్టీ ఫిరాయింపులతో ‘ప్రజాస్వామ్య అత్యాచారం’ పెరిగిపోయింది.
నాటి కర్పూరీ జీవితానికి, నేటి చోటా లీడర్ దర్పానికి పొంతన ఉందా?
‘అత్యుత్తములు సమాజంలోని అందరి అభివృద్ధి కోసం నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం’ అని ‘మాజినీ’ నిర్వచనం ఇచ్చాడు. అయితే, ఉత్తములు అంటే ఎవరు అనేదే ప్రశ్న. సంపన్నులవైపు మాత్రమే వ్యవస్థలు, పార్టీలు, ఆఖరుకు ప్రజలు కూడా చూస్తున్నారు. అధికారాన్ని సేవకోసం కాకుండా వ్యక్తిగత ఆనందం కోసం పదవులు కావాలనుకుంటున్నారు.
ఇటీవల బిహార్ ముఖ్యమంత్రిగా, బడుగువర్గాల సేవలందించి దివంగతుడైన కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ..కర్పూరీ జీవితంలోని ఓ ఘటనను తన వ్యాసంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జేపీ పుట్టినరోజు వేడుకలకు వెళ్లినప్పుడు తన కోటు చినిగిపోయి ఉండటం చూసి మాజీ ప్రధాని చంద్రశేఖర్ చందాలకు అప్పీలు చేశారట. వచ్చిన డబ్బు ఠాకూర్ సీఎం నిధికి ఇవ్వడం మోదీ ఉటంకించారు. ఈ దృశ్యం చూద్దామా..లేక గ్రామాల్లో ఓ మాజీ ప్రతినిధి తన కారుకు మాజీ అనేపదం చిన్నసైజులోపెట్టి తన పాత పదవిని బోల్డ్‌గా పెట్టడం ఆశ్చర్యంగా, ప్రజాస్వామం దిగజారిందని గ్రహిద్దామా.
అతిపెద్ద జనాభా ఉన్న మనదేశంలో ప్రజాస్వామ్య సూత్రాలు వంటబట్టాయా లేదా అని ఆలోచించకుండా మేధోస్థాయిలో సమయం దొరికినప్పుడల్లా వల్లె వేస్తున్నారు ఆ వల్లెవేసే వంది మాగధులే అధికారం పంచన చేరుతున్నారు. తమకు కావాల్సింది మాట్లాడటం, తమకు ఉపయోగపడనిది ఉద్దేశపూర్వక విస్మరణ చేయడం పరిపాటిగా మారింది. ఈ మేధో ఉగ్రవాదులు ఇదంతా ఓ సంప్రదాయంగా మార్చేశారు.
ఉద్దేశ్యపూర్వక విస్మరణ
ప్రస్తుతం బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆడవారిని తన పార్టీ కార్యాలయంలోకి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు గురిచేయడం అమానుషం అని అక్కడ మహిళలంతా గోల చేస్తుంటే.. న్యూయార్క్ టైమ్స్‌లో భారత్‌ను ఎప్పుడూ తూర్పారబట్టే ఓ ప్రముఖ రచయిత్రి, స్వేచ్ఛావాది నిశ్శబ్దంగా ఉంది. తెలంగాణలో గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో జరిపిన ప్రహసనం ఇప్పుడు చూస్తుంటే ఇంతమంది ‘సలహాదారులు’ ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వంతో కలిసి నడిచారు కదా.
ఎవరూ సలహా ఇవ్వలేదా. ఇస్తే తీసుకోలేదా. అన్నది ప్రశ్న. ఇదంతా ఎందుకు జరుగుతోంది. సందేశ్‌ఖాలీ పోలీసులు తమ పని తాము సరిగ్గా చేయడం లేదు అని అర్థం అవుతోంది. ఆ పోలీస్ వ్యవస్థను బానిసల్లా అక్కడి ప్రభుత్వం వాడినట్లే, ఇక్కడి ఐఏఎస్ వ్యవస్థను అలాగే వాడిందా అనిపిస్తోంది. నాయకుడు, అధికారి ఇద్దరూ పరస్పరం కలిసి ‘మంచికోసం’ పనిచేయాలి.
కానీ, అధికార దుర్వినియోగం చేయకూడదు. ఒకరు కఠినంగా ఉన్నా మరొకరు సేవాగుణం కలిగి ఉండాలి. స్ర్తీలు, బాలలు, వృద్ధులు, దివ్యాంగులు, బీదవారిపట్ల దయాగుణం కలిగి ఉండాలి. అలాకాకుండా అధికారులు నాయకులైపోదామనే కొత్త పోకడలు ప్రజాస్వామ్య విలువలకు సరైనవి కావు. నేరుగా రాజకీయాల్లోకి వచ్చి తమ శక్తియుక్తులను నిరూపించుకుని నాయకుడు అవ్వొచ్చు.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని పీఠంపై ఉండేవారి తప్పులను చట్టబద్ధం చేసేందుకు ఉపాయాలను చెప్పి రాజకీయాల్లోకి రావడం దుర్మార్గం. రాజకీయాల్లో మాత్రమే శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండకపోవచ్చు. కానీ, పరిపాలనలో మాత్రం పాలకులు, అధికారులు శాశ్వత మిత్రులే . సలహాదారులు, కార్యదర్శులు, పాలనా ప్రణాళికా రచయితలైన అధికారులు ఎంతసేపూ పాలకుని మనసు దోచే ప్రయత్నంలో ఉంటుంటారు. పాలకుడు కోరిన ప్రణాళికలు రచించి దోపిడీ పాపంలో భాగస్వామ్యం సాధిస్తుంటారు. పదేండ్ల తెలంగాణలో జరిగిన విధ్వంసం, అనర్థం, కుంగుబాట్లను చూస్తే పాలకులు, అధికారుల అనుబంధం, ఆత్మీయత ఎంత బలమైందో తెలిసిపోతూనే ఉంది.
మాకేం తెలియదంటున్న నాయకులు
మన దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు తాము ఏం చేస్తున్నారో, ఏం చేస్తారో ఎవరూ చెప్పడం లేదు. కొందరు నరేంద్ర మోదీని చూపిస్తున్నారు. మొన్నటి తెలంగాణలో కేసీఆర్ అన్నింటికీ ‘జిందా తిలిస్మాత్’ అన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణలో కొత్త ప్రభుత్వంలో కొందరు గతంలో తమ పార్టీ ఏం చేసిందో చెబుతున్నారు. ఇది సరైందేనా అని ప్రజాప్రతినిధులు ఆలోచించాలి.
ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ప్రతివారికి సరైన విధులు ఉన్నాయి. ఆ జాబ్‌చార్ట్ చదివితే మంచిది. అధికారాన్ని తమ కేంద్ర నాయకుల వద్ద పెట్టి తాము తోలుబొమ్మలుగా నిలబడినవాళ్లంతా కనుమరుగైపోయారు. ప్రతిదానికి తమ సీఎంనే చూపిస్తే మరి మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? అధినేతలు ఉండగా మాకు ప్రజాస్వామ్యం ఎందుకు అంటున్నారు! అధికారం పోతే ఖచ్చితంగా వారే ప్రజాస్వామ్యం లేదంటారు, ధర్నాలకు దిగుతుంటారు! చలో మేడిగడ్డ లాంటి యాత్రలూ చేస్తుంటారు!
- ప్రజాపతి