మునుగోడు : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఉప ఎన్నిక సందర్భంగా పలు పార్టీలు ఓటర్లకు హామీల జల్లు కురిపిస్తుండగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షలు కేపాల్ మాత్రం విభిన్నంగా ప్రచారం చేస్తున్నారు. తనదైన స్టైల్లో ప్రచారం చేస్తూ మీడియా దృష్టిని తనవైపునకు తిప్పుకుంటున్నారు. రకరకాల వేషధారణలలో కనిపిస్తూ వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. ఒక రోజు డ్యాన్సులు చేస్తూ.. సైకిల్ తొక్కుతూ.. చేనులో పత్తి ఏరుతూ.. స్కూల్ పిల్లలకు గాలిలో ముద్దులు పెడుతూ.. బాయ్ బాయ్ చెప్పి ఓట్లు అడిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మునుగోడులో ప్రచారం సందర్భంగా చిన్నపిల్లలతో కలిసి కేఏ పాల్ డ్యాన్స్ చేశారు. ఆయన పేరు రూపొందించిన పాటకు చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేశారు.
గొర్రెల కాపరి వేషధారణలో పాల్
ఈనెల 30వ తేదీన కేఏ పాల్.. గొల్ల కురుమ వేషధారణలో ప్రచారం చేశారు. తనదైన మాటతీరుతో ప్రత్యేకతను చాటుకునే కేఏ పాల్ గొర్రెల కాపరిలా ప్రచారం చేశారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పాలనలో కష్టాలు పడుతున్నారని, గొర్రెల కాపరులకు సైతం కష్టాలు తప్పడం లేదని ఆరోపించారు. యువకులు డిగ్రీ, పీజీలు చదివినా ఉద్యోగాలు లేకపోవడంతో చాలా మంది గొర్రెలు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉప ఎన్నికలో తనను గెలిపిస్తే.. ప్రతి గ్రామానికి 20మందికి చొప్పున ఉద్యోగాలు ఇస్తానంటూ నాంపల్లి మండలంలో ప్రచారం చేశారు.
రైతు వేషధారణలో పాల్
అంతకుముందు.. ప్రచారంలో భాగంగా కేపాల్.. రైతు వేషధారణలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తలకు కండువా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకుని.. రైతులతో కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి నడుస్తూ తన మాటలతో నవ్వించాడు. సమస్యలను అడిగి తెలుసుకుని తాను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
చెప్పులు కుడుతూ కేపాల్
అంతకుముందు.. మునుగోడు మండల కేంద్రంలో చెప్పులు కుడుతూ కేపాల్ వినూత్నంగా ప్రచారం చేశారు. ‘‘ అమెరికాలో చెప్పులు కుట్టిన అబ్రహం లింకన్ అధ్యక్షుడు అయ్యాడు. అది అమెరికా గొప్పతనం. కానీ మన దేశంలో ఇది సాధ్యమా’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘చెప్పులు కుట్టుకుని బతికే వారికి రోజుకి 300 రూపాయలు కూడా రావడం లేదు..ఇదేనా బంగారు తెలంగాణ’ అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరూ మహారాజులు కాలేరని.. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చినప్పుడే మహారాజులు అవుతామని కేఏ పాల్ అన్నారు. మాదిగల కష్టాలు తనకు తెలుసని, అందుకే మార్పు తీసుకురావడానికి వచ్చానంటూ చెప్పుకొచ్చారు. మార్పు రావాలంటే కేఏ పాల్ రావాలని.. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాంటూ ఓటర్లను అభ్యర్థించారు.
సెలూన్ లో కటింగ్
అంతకుముందు.. మునుగోడులో ప్రచారం చేస్తున్న కేఏ పాల్..ఓ సెలూన్ కు వెళ్లి కటింగ్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్ చేశారు. మునుగోడులో తాను గెలిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు తానే సీఎం అవుతానని చెప్పారు. కాంగ్రెస్ పని అయిపోయిందని ఆ పార్టీ పెద్దలు తనకే మద్దతు తెలుపుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందడం లేదని, అందుకే అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
హోరాహోరీగా పార్టీల ప్రచారం
మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ బరిలో ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.