హైదరాబాద్ : ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ నిరసన చేపట్టారు. తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్, పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మణిపూర్ ఘటనలపై నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సినీ నటుడు రాజా కూడా పాల్గొన్నారు. మణిపూర్ ఘటనలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలుసు అని వ్యాఖ్యానించారు కేఏ పాల్. ఈ ఘటనలు రెండు మతాల మధ్య జరిగినవి కాదన్నారు. మణిపూర్ లో జరుగుతున్న ఘటనలు రెండు ట్రైబల్స్ వర్గాల మధ్య జరుగుతున్న గొడవలు కాదని చెప్పారు. మణిపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తో పాటు ప్రధాని మోదీ కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాన్ పైనా మండిపడ్డారు కేఏ పాల్. బీజేపీకి, టీడీపీకి పవన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీని గెలనివ్వమన్నారు. ‘‘మోడీకి హటావో దేష్ కి బచావో’’ అంటూ వ్యాఖ్యానించారు. మణిపూర్ లో జరిగిన ఘటనలు చాలా బాధాకరమన్నారు సినీ నటుడు రాజా. ఆ రాష్ర్టంలో జరిగిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.