తెలంగాణలో మరో ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తమ పార్టీ అభ్యర్థులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని చెప్పారు. ఈసారి ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్ విధానం ద్వారానే ఎలక్షన్స్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ తనకు హామీ ఇచ్చిందన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీకి పడిన ఓట్లన్నీ ఈవీఎంలు మార్చి బీజేపీ, టీఆర్ఎస్ లాగేసుకున్నాయని ఆరోపించారు. గద్దర్ పై ఒత్తిడి తేవడం వల్లే ఆయన మునుగోడు పోటీ నుంచి వెనక్కి తగ్గారని చెప్పారు. గద్దర్ ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారని ఆరోపించారు. గద్దర్ కు రూ.200 కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతోందని..కానీ ఆయన అలాంటివారు కాదని తనకు తెలుసని కేఏ పాల్ తెలిపారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీలో 7000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆమె అన్నయ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఆ రాష్ట్రం ఏం బాగుపడిందని కేఏపాల్ ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణలో షర్మిల ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తాను తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమ సమయంలో మద్దతు ఇచ్చాననని గుర్తు చేశారు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో జరిగిన సేవ్ తెలంగాణ యాత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా కేఏ పాల్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.