- కలెక్టర్ నారాయణరెడ్డి
నిజామాబాద్, వెలుగు: భూ సమస్యల పరిష్కారం కోసం ఐదు వారాల పాటు మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ప్రత్యేకంగా భూ సంబంధిత సమస్యలపైనే ప్రజావాణి నిర్వహించాలని సూచించారు. ధరణి ప్రోగ్రామ్‌పై గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు ఉపయోగపడేలా మీ సేవా కేంద్రాలు హెల్ప్ లైన్ సెంటర్లుగా సేవలందించాలని కలెక్టర్ సూచించారు.
కేంద్రాల్లోని ఆపరేటర్లకు ధరణికి సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. డివిజన్ల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించాలని, మీ సేవ కేంద్రాలు హెల్ప్ లైన్ సెంటర్లుగా ఉపయోగపడేలా చూడాలన్నారు. తహసీల్దార్‌తో పాటు ఆర్ఐ, సర్వేయర్ తప్పనిసరిగా ప్రజావాణిలో అందుబాటులో ఉండాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.