- నల్గొండ జిల్లాలోని 33 మండలాల్లో 1706 ఫిర్యాదులు
- సూర్యాపేట జిల్లాలో 500 పైగా.. యాదాద్రి జిల్లాలో 96 అర్జీలు
నల్గొండ అర్బన్/యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : జిల్లా, మండల స్థాయిలో నిర్వహించిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభించింది. కొత్తగా కలెక్టర్సి.నారాయణరెడ్డి జిల్లా స్థాయిలో ప్రజావాణి రద్దు చేసి మండల స్థాయిలో సోమవారం నుంచి ప్రారంభించారు. కలెక్టర్సైతం చింతపల్లి మండలంలో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్నారు. దీంతో మండల స్థాయిలో నిర్వహించిన ప్రజావాణికి రికార్డు స్థాయిలో 1,706 ఫిర్యాదులు వచ్చాయి. దీంట్లో రెవెన్యూ ఫిర్యాదులే 910 రావడం గమనార్హం. ఇతర శాఖల ఫిర్యాదులు 796 వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారంపైనే మండల స్థాయి బృందాలు దృష్టి సారించాలని, ఏ ఒక్క దరఖాస్తు జిల్లా స్థాయికి నేరుగా రావద్దని చెప్పారు. మండలానికి వస్తే సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం ప్రజల్లో కల్పించాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ వారంలోపు పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణికి వచ్చే అన్ని రకాల దరఖాస్తులను తీసుకోవాలని, గ్రామ పంచాయతీల వారీగా ఆయా పథకాల కింద అర్హత కలిగిన దరఖాస్తులను తీసుకొని ఒక రిజిస్టర్ను నిర్వహించాలన్నారు
మండల స్థాయిలో గ్రామాలవారీగా ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంపై గ్రామపంచాయతీ కార్యదర్శులతోపాటు అందరికీ అవగాహన కలిగే విధంగా ఆయా పథకాలపై తెలుగులో సర్య్కూలర్జారీ చేస్తామని తెలిపారు. వారంలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ టి.పూర్ణచంద్ర, జడ్పీ సీఈవో జిల్లా స్థాయి ప్రజావాణి ప్రత్యేకాధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి, నోడల్ అధికారి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్, డీఈవో తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లాలో ఎక్కువ భూమి ఫిర్యాదులు..
యాదాద్రి, వెలుగు : యాదాద్రి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి పెద్ద ఎత్తున భూమికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా 96 ఫిర్యాదులు రాగా, వీటిలో భూమికి సంబంధించిన ఫిర్యాదులే 73 ఉన్నాయి. ఏండ్ల తరబడి తిరుగుతున్నా.. భూ సంబంధిత సమస్యలు పరిష్కరించడం లేదని బాధితులు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ హనుమంతు జెండగే, అడిషనల్కలెక్టర్లు బెన్షాలోమ్, గంగాధర్స్వీకరించిన పరిశీలించారు. ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, స్పెషల్డిప్యూటీ కలెక్టర్జయశ్రీ, కలెక్టరేట్ ఏవో జగన్మోహన్ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో 500కు పైగా..
సూర్యాపేట, వెలుగు : గత కొన్ని నెలలుగా పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిచిపోయింది. కోడ్ ముగియడంతో సూర్యాపేట జిల్లాలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ఒక్కరోజే దాదాపు 500 పైగా బాధితులు కలెక్టరేట్ కు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూసమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగస్టుల సమస్యలు ఉన్నాయి.
ఏండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. గ్రీవెన్స్ లో 500 పైగా దరఖాస్తులు రాగా, రెవెన్యూశాఖకు సంబంధించి 200 పైగా, డీఆర్డీవో 70, డీపీవో 60, ఇతర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు 150 పైగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.