- ప్రతీ వారం కలెక్టరేట్ కు వస్తున్నామని బాధితుల ఆవేదన
- సుమారు 800 భూసమస్యల అప్లికేషన్లు పెండింగ్
- పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్
కామారెడ్డి , వెలుగు: ప్రజావాణికి ఎన్ని సార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో ఫిర్యాదుదారులు వారాలు నెలల తరబడి కలెక్టరేట్చుట్టూ తిరుగుతున్నారు. ప్రయాణ ఖర్చుల భారం పెరుగుతుందే తప్పా.. ఆఫీసర్లు తమ సమస్యలు పరిష్కరించడం లేదని వాపోతున్నారు. జిల్లాలో పాసుబుక్‌లో తప్పులు, భూమి తక్కువ, సరిహద్దుల కొలతలు, పాత బుక్‌లో భూమి ఉండి కొత్త పాసుబుక్ రాకపోవడం, ధరణి పోర్టల్‌లో వివరాలు లేకపోవడం లాంటి సమస్యల పరిష్కారం కోసం సుమారు 800 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
పరిష్కరించే స్థాయిలో ఉన్నప్పటికీ..
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల్లో కొన్ని అప్పటికప్పుడు పరిష్కారం చేసే అప్లికేషన్లు కూడా ఉన్నప్పటికీ సంబంధిత ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బాధితులు నిత్యం ప్రజావాణికి రావాల్సి వస్తోంది. దివ్యాంగులుగా అర్హులై ఉన్నప్పటికీ ఫించన్లు రాని వారు ఉన్నారు. కొందరికీ సదరం సర్టిఫికేట్లు కూడా రావడం లేదు. మీ సేవలో టోకెన్లు జారీ కావట్లేదు. ఈ పరిస్థితుల్లో వారాల తరబడి దూర ప్రాంతాల నుంచి ఇబ్బందులు పడుతూ కలెక్టరేట్‌కు వస్తున్నారు.
జుక్కల్ ఏరియా వాసులకు ప్రాబ్లమ్స్
జుక్కల్ నియోజక వర్గం జిల్లా కేంద్రానికి దూరంగా ఉంటుంది. ఈ నియోజక వర్గంలోని మండలాలు జిల్లా కేంద్రానికి 80 నుంచి 100 కి.మీ. దూరం ఉన్నాయి. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల్లో సగం ఈ ఏరియాలకు సంబంధించినవే ఉంటాయి. గతంలో నెలలో ఒక వారం జుక్కల్‌లోనే జిల్లా ఆఫీసర్లతో ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహించేవారు. ఇప్పుడు అక్కడ నిర్వహించడం లేదు. ప్రతి వారం అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి బిచ్కుంద మండలం బండా రెంజల్‌కు చెందిన బండి సాయిలు. గ్రామంలోని 513 సర్వేనంబర్‌లో 14 గుంటల భూమి ఉంది. పాస్‌బుక్‌లో భూమి ఉన్నా.. ‘ధరణి’లో కనిపించడం లేదని ఆరు సార్లు స్థానిక తహసీల్దార్‌కు విన్నవించాడు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజావాణికి వచ్చి కంప్లైంట్చేశాడు. ప్రజావాణిలోనూ ఇప్పటి వరకు ఆరు సార్లు విన్నవించినా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం వచ్చి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు. ‘తన ఊరు కామారెడ్డికి 80 కి.మీ దూరం ఉంటుంది. వచ్చి పోయేందుకు బస్సు, ఆటో చార్జీలు, హోటల్ఖర్చులు కలుపుకుని సుమారు రూ.400 వరకు అవుతోంది. ఇప్పటి వరకు రూ. 2,800 వరకు ఖర్చయ్యాయి. సమస్య పరిష్కారం కాలే’ అని వాపోయాడు.
‘ఈ ఫొటోలో ఉన్న రైతు దోమకొండ మండలం ముత్యంపేటకు చెందిన చీకోటి నర్సారెడ్డి. గ్రామంలోని సర్వే నంబర్ 166/అలో 25 గుంటల భూమి ఉంది. కొన్ని రోజుల కింద పాస్బుక్క్యాన్సల్చేశారు. ఎందుకు చేశారని అడిగితే ఆఫీసర్లు చెప్పడం లేదు. తనకు పాస్‌బుక్ ఇప్పించాలని ఇప్పటికి పది సార్లు ప్రజావాణికి వచ్చినా.. సమస్య పరిష్కారం కాలేదని వాపోయాడు. వచ్చినప్పుడల్లా రూ. 200 చార్జీ అవుతోందని ఇప్పటి వరకు రూ. 2,000 కిరాయిలే అయ్యాయని వాపోయాడు’.