ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉదృతి క్రమంగా పెరుగుతోంది. కృష్ణానది ఎగువ ప్రాంతాలైన పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుండి మిగులు జలాలు పెద్ద ఎత్తున వస్తుండడంతో బ్యారేజీ నీటీ ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అదనంగా, బ్యారేజీ నుండి 3,507 క్యూసెక్కుల నీటిని స్థానిక కాలువలకు మళ్లించారు.
కాగా, భారీ వర్షాల కారణంగా విజయవాడ పట్టణ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. కొండచరియలు విరిగిపడుతుండటంతో విజయవాడ కనకదుర్గ ఆలయ ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. అలాగే, ముందుజాగ్రత్త చర్యగా దుర్గా టెంపుల్ ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేశారు.