హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధాని చేయాలి : ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్

హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధాని చేయాలి : ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్
  • క్యాపిటల్​గా ఢిల్లీ ఉండటం సేఫ్ కాదు: ప్రకాశ్ అంబేద్కర్
  • సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్
  • వేలాది కేసులు పెండింగ్​లో ఉన్నయ్: జస్టిస్ చంద్రకుమార్​
  • హైదరాబాద్ రెండో రాజధాని ప్రతిపాదనకు నేను వ్యతిరేకం: ఎమ్మెల్సీ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్​ను రెండో రాజధానిగా చేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. పాకిస్తాన్, చైనాకు ఢిల్లీ చాలా దగ్గరలో ఉందని తెలిపారు. ఇలా ఉండటంతో దేశ రక్షణకు శ్రేయస్కరం కాదన్నారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘హైదరాబాద్​ను దేశ రెండో రాజధాని చేయాలి’అని కోరుతూ పింగిళి సంపత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. ఈ మీటింగ్​కు ప్రకాశ్ అంబేద్కర్ చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ‘‘హైదరాబాద్​ను దేశ రెండో రాజధాని చేయాలి. సుప్రీం కోర్టు బెంచి ఏర్పాటు చేయాలి. 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హైదరాబాద్​లోనే జరపాలి. దేశానికి రెండో రాజధాని ఉంటే.. అటు లాభాలు.. ఇటు నష్టాలూ ఉంటాయి. కులం, మతం ఆధారంగా దేశ రాజకీయాలు నడుస్తున్నాయి. బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఎదగాలంటే కుల, మతాలకు అతీతంగా ఐక్యం కావాలి. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగిపోవాలి’’అని ఆయన అన్నారు. ప్రజల మధ్య నార్త్, సౌత్ అనే భావన ఉండొద్దని తెలిపారు. పార్లమెంట్​లోనూ నార్త్, సౌత్ అనే విభజన ఉందన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించకపోతే ప్రజల్లో నార్త్, సౌత్ అనే బేధం మరింత బలపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు బెంచ్ ఉంటే సరిపోతది: అద్దంకి దయాకర్

దేశానికి హైదరాబాద్.. రెండో రాజధానిగా ఉంటే బాగుంటుందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. వేలాది కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్​లో ఉన్నాయని, దక్షిణాది కేంద్రంగా హైదరాబాద్​లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు ఇక్కడ ఏర్పడే అవకాశం ఉండటంతో హైదరాబాద్​ను దేశానికి రెండో రాజధాని చేయాలన్న ప్రతిపాదనకు తాను వ్యతిరేకమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విదేశీ కంపెనీలు వస్తే.. గుజరాత్, మహారాష్ట్రాలకే కాకుండా అన్ని స్టేట్లకు న్యాయం చేయాలని కోరారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. 

నార్త్ ఇండియాతో పోలిస్తే.. సౌత్ ఇండియాలో జనాభా తక్కువని, దీంతో చట్టసభల్లో ఇక్కడివాళ్ల ప్రాతినిథ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జలశయాలు, ఆర్థిక వ్యవస్థను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు, న్యాయమైన వాటాలు దక్కాలని కోరారు. హైదరాబాద్​లో పార్లమెంట్ సమావేశాలు, సుప్రీం కోర్టు బెంచ్ ఉంటే సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. దక్షిణాదిలో కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అంబేద్కర్ ఆ రోజుల్లోనే చెప్పారని గుర్తు చేశారు.