- కేసీఆర్, ఒవైసీ కుటుంబ పార్టీల నుంచి సిటీని కాపాడుకోండి
- టీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే
- కేసీఆర్ ఆరేండ్ల పాలన అంతా అవినీతే
- ఆయన చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో అందరికీ తెలుసని కామెంట్
- జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్, ఎంఐఎం సర్కారు ఫెయిల్యూర్స్‌పై చార్జిషీట్
హైదరాబాద్, వెలుగు: ‘‘గ్రేటర్ హైదరాబాద్ కు బీజేపీ మేయర్ కావాల్నా, మజ్లిస్ మేయర్ కావాల్నా ప్రజలు తేల్చుకోవాలి. టీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ పార్టీకి వేసినట్టే. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆరేండ్ల పాలన అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. హైదరాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తానన్న కేసీఆర్.. వరదల సిటీగా మార్చిండు. గ్రేటర్ మేయర్ సీటు బీజేపీదే. దుబ్బాక రిజల్టే ఇక్కడా రిపీట్ కాబోతోంది.’’ అని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో ‘జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్, ఎంఐఎం సర్కారు ఫెయిల్యూర్స్‌పై చార్జిషీట్’ను జవదేకర్ రిలీజ్ చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి దీన్ని రూపొందించగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అర్వింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం తో కలిసి జవదేకర్ విడుదల చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబ పార్టీల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్, హరీశ్, కేటీఆర్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకను గెలిచామని.. ఆ ఫలితమే జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో రిపీట్ కాబోతోందన్నారు.హైదరాబాద్‌ను డల్లాస్ నగరం చేస్తామన్న కేటీఆర్ వరదల నగరంగా మార్చారని.. ఆరేండ్ల టీఆర్ఎస్ పాలనలో 60 అంశాల్లో పూర్తిగా ఫెయిలయ్యారని జవదేకర్ ఆరోపించారు.
రాష్ట్రాన్ని దోచుకుంటున్నరు
తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని, ఆ కుటుంబ పెత్తనాన్ని ఆపాలంటే గ్రేటర్ ఎలక్షన్లలో బీజేపీని గెలిపించాలని జవదేకర్ పిలుపునిచ్చారు. వరద బాధితులకు సాయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, లక్ష ఉద్యోగాలని చెప్పిన హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రధాని మోడీ పీఎం ఆవాస్ యోజన స్కీంలో రెండున్నర లక్షల ఇండ్లు నిర్మిస్తే.. కేసీఆర్ రెండు వందల ఇండ్లు కూడా కట్టించలేదన్నారు. హుస్సేన్ సాగర్‌లో ఉన్న కొబ్బరినీళ్లను కేసీఆర్ తాగుతున్నారా అని ఎగతాళి చేశారు. ‘‘కరోనా టైంలో ప్రజలను గాలికి వదిలి కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో పడుకున్నారు. టీఆర్ఎస్ సర్కారు ఆరోగ్యశ్రీలో కరోనా ట్రీట్మెంట్ను చేర్చలేదు. దాంతో పేదలు అప్పులు చేసి మరీ కార్పొరేట్ హాస్పిటళ్లకు పది పదిహేను లక్షల బిల్లులు కట్టారు. అదే ఆయుష్మాన్ భారత్ స్కీం అమలు చేసి ఉంటే పేదలకు కరోనా ట్రీట్మెంట్ ఫ్రీగా అందేది. వీటన్నింటికీ కేసీఆర్ సమాధానం చెప్పాలె..” అని జవదేకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎంతో కీలకమని.. సుష్మాస్వరాజ్ ఆ దిశగా ఎంతో తోడ్పాటు అందించారని గుర్తు చేశారు. గత ఏడాది లోక్ సభ ఎలక్షన్ల టైంలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. కాగా.. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అహ్మదాబాద్ వారిలా అమాయకులు కాదన్న మంత్రి కేటీఆర్ కామెంట్లను మీడియా ప్రస్తావించగా.. జవదేకర్ స్పందిస్తూ.. ‘‘అహ్మదాబాద్ 15 ఏళ్ల కిందే ఎంతో డెవలప్ అయింది. అప్పటినుంచి అక్కడ ఎలాంటి గొడవలు లేవు..” అని చెప్పారు.
సమస్యలపై లక్షల ఫోన్లు వచ్చాయి: వివేక్ వెంకటస్వామి
ఆరేండ్లలో కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. చార్జిషీట్ విడుదల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం రావాలని అందరం కలిసి కొట్లాడామని, కేంద్ర మంత్రి జవదేకర్ ఆ విషయాన్నే గుర్తు చేశారని చెప్పారు. కానీ రాష్ట్రం వచ్చాక ఏర్పాటైన టీఆర్ఎస్ సర్కారు పూర్తిగా దోచుకోవడంపైనే దృష్టిపెట్టిందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇస్తూనే ఉన్నారని.. కానీ వేటినీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ ఫెయిల్యూర్పైనే చార్జిషీట్‌ను రూపొందించామని చెప్పారు. పార్టీ మేనిఫెస్టో చైర్మన్ గా ఉన్న తనకు టీఆర్ఎస్ సర్కారు పాలనపై చార్జిషీట్ రెడీ చేయాలని పార్టీ రాష్ట్ర చీఫ్బండి సంజయ్ సూచించారని చెప్పారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజల సమస్యలు తెలుసుకుందామని యాప్, కాల్ సెంటర్ ను ప్రారంభించామన్నారు. లక్షలాది మంది ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పారని.. ఇంత పెద్ద సంఖ్యలో కంప్లైంట్లు రావడంపై తాము ఆశ్చర్యపోయామని వివరించారు. అలా ప్రజలు చెప్పిన సమస్యలు, సర్కారు ఫెయిల్యూర్స్‌తో చార్జిషీట్ రూపొందించామని తెలిపారు. ప్రధానంగా 60 సమస్యలు ఉన్నాయని, అందులో కీలకమైనవి పది ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు చాలా పనులు ఉంటాయని, బిజీగా ఉంటారని ఇటీవల మంత్రి కేటీఆర్ చెప్పారని.. ప్రజల సమస్యల పరిష్కారం కంటే ముఖ్యమైన పని కేసీఆర్‌కు ఏం ఉందని వివేక్ నిలదీశారు.
చార్జిషీట్లోని అంశాలివీ..
- హైదరాబాద్ డెవలప్మెంట్కు ఖర్చు చేశామని చెప్తున్న రూ.67 వేల కోట్లకు లెక్కాపత్రం ఉందా?
- లక్ష బెడ్రూం ఇండ్లిస్తామని 1,100 గృహ ప్రవేశాలు మాత్రమే ఏమిటి?
- డల్లాస్, ఇస్తాంబుల్ ఇట్లనే నీళ్లలో మునుగుతయా?
- కేటీఆర్ వంద గప్పాల ప్లాన్ ఏమైంది?
- మూసీ రివర్ ఫ్రంట్ అందాలేవీ?
- 2016 ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు గుర్తుకు లేవా?
- ఇంటింటికి రూ.10 వేలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?
- ఆస్తి పన్ను రిబేటు మరో డ్రామా
- రోడ్లంటే ఉత్త రిబ్బన్ కట్టింగ్ లేనా?
- హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లెప్పుడు?
- మెట్రో రైల్ ఓల్డ్ సిటీ వరకు ఎందుకు పోలే?
- హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ టవర్లు ఏవి?
- విశ్వనగరం అంటే విధ్వంసమా?
- విజన్ లేని రిజర్వాయర్లు, కనెక్షన్ లేని నల్లాలు
- ఉద్యోగాల ‘టాస్క్’ ఉత్తదేనా?
- జీహెచ్ఎంసీపైనా అప్పులు తెచ్చుడేనా?
- జీహెచ్ఎంసీకి బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వలేదేం?
- సిటీలో మోడల్ మార్కెట్లు కనిపించటం లేదు
- చెత్త డంపింగ్ ఎక్కడ?
- ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఎందుకు ఆగింది?
- జాడ లేని భారీ ఆడిటోరియం
- ట్రాక్ కోసం వెతుకుతున్న సైకిళ్లు
- పేద, మధ్య తరగతికి శాపం ఎల్ఆర్ఎస్
- కరోనాపై చేతులెత్తేసిన సర్కారు
- సింగిల్ ఫ్యామిలీ కోసమేనా తెలంగాణ?
- సిటీకి నాలుగు వైపులా పెద్దాస్పత్రులేవి?
- రాష్ట్రంలో లక్ష కోట్ల అవినీతి
- సర్కారు తీరు పైన పటారం.. లోన లొటారం
- పాతబస్తీ భాగ్యనగరంలా కావాలా?.. భాగ్యనగరం పాతబస్తీలా కావాలా?
(వీటితో పాటు మరో 30 అంశాలను చార్జిషీట్ లో పేర్కొన్నారు)