తిరుమల లడ్డూ వివాదం మొదలైన నాటి నుండి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా ఎప్పటికప్పుడూ ప్రకాష్ రాజ్ కౌంటర్లు ఇస్తున్నారు. గురువారం (అక్టోబర్ 3) తిరుమలలో పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్‌పై తాజాగా ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు.
సనాతన ధర్మాన్ని రక్షించేందుకు హిందువులు ఏకం కావాలన్న పవన్ కామెంట్స్‌కు కౌంటర్‌గా.. ‘‘సనాతన ధర్మ రక్షణలో మీరుండండి.. సమాజ రక్షణలో మేముంటాం’’ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడూ ప్రకాష్ రాజ్ కౌంటర్లు ఇవ్వడం సినీ, పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులైన ఇద్దరి మధ్య లడ్డూ వివాదంపై జరుగుతోన్న డైలాగ్ వార్ ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని ఆసక్తి నెలకొంది.
ALSO READ | సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా..? పవన్ కల్యాణ్‌పై జగన్ ఫైర్
కాగా, తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. నిన్నటితో (అక్టోబర్ 3) 11 రోజుల దీక్ష ముగియడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పవన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మంపై హాట్ కామెంట్స్ చేశారు. సనాతన ధర్మంపై ఏళ్లుగా దాడి జరుగుతోందని.. అయిప్పటికీ హిందువులు మౌనంగా ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఇతరులు వారి మతాల్ని రక్షించుకుంటున్నారని.. హిందువులు కూడా అదే స్ఫూర్తితో ఒక్కటవ్వాలని పవన్ పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని రక్షించుకునే సమయం ఆసన్నమైందన్నారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపిస్తామంటున్న వారి మాటలు కొందరు సూడో మేధావులకు కనిపించడం లేదంటూ పవన్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పై విధంగా ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.