
హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘2016లో నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన మాట నిజం. 9 ఏళ్ల కింద ఏడాది ఒప్పందంతో బెట్టింగ్ యాడ్ ప్రమోట్ చేశా. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లో ఒప్పందం పొడిగిస్తామని నిర్వాహకులు అడిగారు.
కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. నా యాడ్ ప్లే చేయొద్దని కోరాను. ప్రస్తుతం నేను ఏ బెట్టింగ్ యాప్‌కు ప్రమోషన్ చేయట్లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపాను. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. అందరినీ ప్రశ్నించే నేను దీనికి సమాధానం చెప్పాలి.. నోటీసులు వస్తే నేను చేసిన యాడ్‌పై పోలీసులకు వివరణ ఇస్తా’’ అని ప్రకాష్ రాజ్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.
అమాయకుల ప్రాణాలు తీస్తోన్న బెట్టింగ్ యాప్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాసుల కక్కుర్తికి ఆశపడి కొందరు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయన్స్ర్లు, సినీ సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ ప్రజలను ఆకర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తోన్న సెలబ్రెటీలపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు సెలబ్రెటీలపై కేసులు నమోదు చేశారు.
ఇందులో నటుడు ప్రకాష్ రాజ్ ఒకరు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఆరోపణలపై ప్రకాష్ రాజ్‌పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు. విచారణకు రావాలని త్వరలోనే ప్రకాష్ రాజ్‌కు కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలిసింది. ఇదే కేసులో బుల్లితెర యాక్టర్స్ విష్ణుప్రియ, రీతు చౌదరిని గురువారం (మార్చి 20) పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు.