మన వ్యాపారాలు కట్​చేస్తే నష్టం పాకిస్తాన్​కే​

ఇంటర్నేషనల్​గా ఒంటరిదైన పాకిస్తాన్… ఏదోలా ఇండియాని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. జమ్మూ కాశ్మీర్​ విషయంలో టర్కీలాంటి ఒకటి రెండు చిన్న దేశాలు మినహా… అమెరికా, ఎమిరేట్స్​ వంటివేవీ సహకరించలేదు. దీంతో ఇండియాతో వ్యాపారం తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనివల్ల మనకంటే పాక్​కే ఎక్కువ నష్టమంటున్నాయి ట్రేడ్​ వర్గాలు. మన దగ్గర నుంచి రా మెటీరియల్​ ఎక్స్​పోర్ట్​ కాకపోతే అక్కడి టెక్స్​టైల్స్​, ఫార్మా రంగాలు పడకేస్తాయని లెక్కలేస్తున్నారు. ఇండియా మాత్రం దుబాయి, సింగపూర్​లను ఆల్టర్నేటివ్​ ట్రేడ్​ హబ్​లుగా ఎంచుకుని ముందుకు సాగనుంది.

కాశ్మీర్​ బూచిని అడ్డం పెట్టుకుని ఇంతకాలం ఇండియాపై వత్తిడి తెచ్చింది పాకిస్తాన్. మొన్నటితో బూచిని బోర్డర్​ అవతలకు నెట్టేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో మరో బెత్తమేదీ లేదు. తనకు అండగా నిలుస్తాయనుకున్న దేశాలుకూడా ‘ఇది మీరు మీరు తేల్చుకోవలసిన విషయం. మధ్యలో మమల్ని ఇన్​వాల్వ్​ చేయకండి’ అన్నట్లుగా దూరం దూరం జరిగిపోయాయి. ఒక్క టర్కీ మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్​గా నిలిచింది. ఇస్లామిక్​ దేశాల ఆర్గనైజేషన్ (ఓఐసీ)లో ముఖ్యమైన అరబ్​ ఎమిరేట్స్​కూడా ఆర్టికల్​–370 రద్దుకే ఓటేసింది. ఎక్కడా తనకు మద్దతు లభించకపోయేసరికి… ఇండియన్​ ఎకానమీని దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో ట్రేడ్​ బ్యాన్​కి దిగింది.

ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య వాణిజ్యంలో టెక్స్​టైల్స్​, ఫార్మాస్యూటికల్స్​ ప్రధానమైనవి. ఈ రంగాల నుంచి పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో ఎగుమతి చేస్తోంది. అయితే, ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… ఆయా రంగాల్లో ప్రొడక్షన్​కి ఇండియా మీదనే పాకిస్తాన్ ఆధారపడాల్సి వస్తుంది. టెక్స్​టైల్స్​, ఫార్మా రంగాల్లో రా మెటీరియల్​ని ఇండియా నుంచే పాక్​ దిగుమతి చేసుకుంటోంది.  ఈ రెండు సెక్టార్లకోసమే పాక్ ఇంపోర్ట్​ ​చేసుకునే  రా మెటీరియల్​ విలువ దాదాపు 100 కోట్ల డాలర్లు (రూపాయల్లో 7,000 కోట్లు).  ఇదొక్కటే కాదు, మొత్తంగా ఇండియా నుంచి పాకిస్తాన్ 1,209 సరుకుల్ని దిగుమతి చేసుకుంటోంది. వీటిలో ముడి పత్తి, నూలు, రసాయనాలు, ప్లాస్టిక్​, చేతిలో వడికిన నూలు,  టెక్స్​టైల్స్​ రంగంలో వినియోగించే డైస్​ (అచ్చులు), గార్మెంట్లు, పాలిమర్​, కార్లు, ట్రక్కులు, ఆటో విడిభాగాలు వంటివి ఉంటాయి. ఇండియా దిగుమతి చేసుకునే సరుకుల్లో తాజా పండ్లు, సిమెంట్​, పెట్రోలియం ఉత్పాదనలు, బల్క్​ మినరల్స్​, ఖనిజాలు,  శుద్ధి చేసిన తోలు, వంట నూనెలకు ఉపయోగపడే గింజలు వంటివి ఉన్నాయి.  ‘కాటన్​, ఆర్గానిక్​ కెమికల్స్​ ముడి పదార్ఘాలు పాకిస్తాన్కి చాలా అవసరం. అవి రెండూ ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటేనే అక్కడ టెక్స్​టైల్స్​, ఫార్మా ఇండస్ట్రీస్​ పనిచేస్తాయి’ అని ఇంటర్నేషనల్​ ఎకనామిక్​ రిలేషన్స్​లో ఇండియన్​ రీసెర్చ్​ కౌన్సిల్​ ప్రొఫెసర్​ నిషా తనేజాఅన్నారు.

ఇండియా ఎగుమతుల విలువ 200 కోట్ల డాలర్ల (దాదాపు రూ.14,000 కోట్లు) పైచిలుకు ఉండగా,  పాక్​ నుంచి ఇండియాకి జరిగే వ్యాపారం విలువ 49.5 కోట్ల డాలర్లు (రూ.3,465 కోట్లు) మాత్రమే. అంటే, మన దేశం నుంచి జరుగుతున్న ఎగుమతులతో పోలిస్తే… పాక్​ మనకు పంపిస్తున్న సరుకుల విలువ నాలుగో వంతుకూడా ఉండదు. జమ్మూ కాశ్మీర్​కి ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్​–370ని రద్దు చేసినందుకుగాను పాక్​ అలిగి ట్రేడ్​ వార్​కి తెర లేపింది. ఆ దేశం తీసుకున్న నిర్ణయం వల్ల మన దేశానికి తక్షణం వచ్చే నష్టమంటూ ఏదీ ఉండదంటున్నాయి ట్రేడ్​ వర్గాలు.   కామర్స్​ మినిస్ట్రీ డేటా ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి 3,894 కోట్ల రూపాయల పత్తిని, 3,186 కోట్ల రూపాయల ఆర్గానిక్​ కెమికల్స్​ని దిగుమతి చేసుకుంది. ఇండియా ఎగుమతి చేసే మొత్తం సరుకుల్లో ఈ రెండింటి విలువ సగానికి పైగా ఉంటుంది.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​ (ఏప్రిల్​–జూన్)లో ఇండియా నుంచి పాకిస్తాన్కి 920 కోట్ల రూపాయల విలువైన ఆర్గానిక్​ కెమికల్స్​, 353 కోట్ల విలువైన పత్తి, మొత్తంగా 3,185 కోట్ల రూపాయల మేర ఎగుమతులు జరిగాయి. దక్షిణాసియా దేశాల్లో మనతో వాణిజ్యం చేసే దేశాల్లో పాక్​ నాలుగో స్థానంలో ఉంది. టాప్​–3లో శ్రీలంక, బంగ్లాదేశ్​, నేపాల్​ ఉండగా, పాక్​ ఆ తర్వాత ఉంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సజావుగా లేకపోవడంవల్ల ట్రేడ్​ అంతగా జరిగిందని కాదు. మన దేశ అవసరాలను తీర్చే స్థాయిలో పాక్​ లేదు. అదీగాక, మోస్ట్​ ఫేవర్డ్​ నేషన్​ (ఎంఎఫ్​ఎన్​) స్టేటస్​ని పుల్వామా దాడి తర్వాత ఇండియా వెనక్కి తీసేసుకుందని  ట్రేడ్​ నిపుణులు అంటున్నారు.

పాకిస్తాన్ మన నుంచి ఇంపోర్ట్​ చేసుకునే సరుకుల విలువ పక్కన బెడితే, వాటి అవసరం అక్కడి ఇండస్ట్రీకి చాలా ఉందన్నారు నిషా. ఇండియా పంపించే సరుకుల్లో 82 శాతం రా మెటీరియల్​కి సంబంధించినవేనని ఆమె చెప్పారు. ఇండియా ఈ మధ్యనే పాకిస్తాన్కి ట్రేడ్​ ఝలక్​ ఇచ్చిందని గుర్తు చేశారు. పాక్​ నుంచి వచ్చే సరుకులపై 200 శాతం సుంకాన్ని విధించింది. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఇబ్బందికరంగా మారిన దౌత్య సంబంధాలకు ఈ ట్రేడ్​ వార్​ తోడయ్యిందంటున్నారు.

అయితే, పాకిస్తాన్లో పూర్తి మెజారిటీ ప్రభుత్వం లేదన్న విషయాన్ని గమనించాలి. 342 సీట్ల పాక్ నేషనల్​ అసెంబ్లీలో అధికార పక్షమైన పాకిస్తాన్ తెహ్రీక్​–ఏ–ఇన్సాఫ్​ (పిటీఐ) బలం 156 మాత్రమే. మెజారిటీ ఫిగర్​కి 16 సీట్లు తక్కువ.  సైన్యం, మిలిటెంట్​ సంస్థల మద్దతుతో అయిదు పార్టీలను కలుపుకుని ఇమ్రాన్​ ఖాన్​ ప్రధాని కాగలిగారు. కాశ్మీర్​ విషయంలో ఇండియా తీసుకునే ఏ నిర్ణయంపైనయినా అక్కడి ప్రజా ప్రభుత్వం సొంతంగా స్పందించే పరిస్థితి లేదు.  రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ టెన్షన్​గానే ఉంటాయి. అయినప్పటికీ ప్రజావసరాలకోసం సరుకుల రవాణా, వాణిజ్యం వంటి దెబ్బతినకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

వేరే రూట్​లో పోగలం

పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలు తెగదెంచుకోవాలని చూడడంతో ఇండియా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంది. వాఘా సరిహద్దుల నుంచి రెండు దేశాల మధ్య సాగే ఇంపోర్ట్స్​–ఎక్స్​పోర్ట్స్​ ఇకపైన ఆగిపోనున్నాయి. దీని ప్రభావం మన ఎకానమీపై పడకుండా మోడీ సర్కారు చర్యలు తీసుకుంది. ప్రపంచ వాణిజ్యానికి హబ్​లుగా మారిన దుబాయి, సింగపూర్​ల మీదుగా సరుకుల కొనుగోలుకు నిర్ణయించింది. ఈ దేశాలు మధ్యవర్తులుగా వాణిజ్య లావాదేవీలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం మన దేశం వీటిద్వారా సాగిస్తున్న లావాదేవీల విలువ దాదాపుగా 70 వేల కోట్ల రూపాయలు. పాకిస్తాన్ నిర్ణయంతో మరింతగా పెరగనుంది.

ఎవరూ తోడు రాలే​

ఆర్టికల్​–370 రద్దు విషయంలో ఇండియాపై వత్తిడి తీసుకురావాలని పాకిస్తాన్ చాలా ట్రై చేసింది. కానీ, ఎవరూ సహకరించలేదు. అమెరికా, అరబ్​ ఎమిరేట్స్​ల సహా దాదాపుగా అన్ని దేశాలూ ఇండియా వైపునే నిలబడ్డాయి. ఒక్క టర్కీ మాత్రమే పాక్​కి మద్దతుగా నిలబడింది. నెదర్లాండ్స్‌ ఏకంగా పాకిస్తాన్ మిలిటెంట్​ కంట్రీగా తప్పుబట్టింది. దక్షిణాసియా దేశాల్లో బౌద్ధ ప్రాబల్యంగల  శ్రీలంక సహజంగానే లఢక్‌ను యూటీగా చేయడాన్ని ఆహ్వానించింది. బ్రిటన్​, ఫ్రాన్స్‌, రష్యా దేశాలు ఇండియాతోగల ఆయుధ వ్యాపారం వల్ల మౌనంగా ఉండిపోయాయి. పాకిస్తాన్ తన ప్రెషర్​ పాలిటిక్స్​ ముందుకు సాగక ట్రేడ్​ వార్​ని నమ్ముకుంది.