నకిరేకల్ (కట్టంగూర్), వెలుగు : డబుల్ బెడ్‌రూం ఇండ్ల పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి విమర్శించారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాములలో శుక్రవారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణలో రెండున్నర లక్షల మందికి ప్రతి ఇంటికి రూ.2.50 లక్షల చొప్పున కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా పేదలకు ఇండ్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇసుక దందా నడిపిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు.
మునుగోడు ఉపఎన్నికల్లో నైతిక విజయం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిదేనని స్పష్టం చేశారు. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారనే ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అంతకుముందు శాలిగౌరారం మండలం వంగమర్తి బ్రిడ్జి, నకిరేకల్ – తానంచర్ల హైవే పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ లింగస్వామి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ పాల్గొన్నారు.
గుజరాత్‌లో భారీ మెజార్టీ ఖాయం
నార్కట్‌పల్లి, వెలుగు : గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు కృ-షి చేయాలని సూచించారు.