
న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌కు ముందు ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై 18 నెలల సస్పెన్షన్ వేటు పడింది. డోప్ టెస్టుల కోసం తన ఆచూకీ వెల్లడించకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఈ చర్యలు తీసుకుంది. దీంతో పారిస్ పారాలింపిక్స్‌లో భగత్ బరిలోకి దిగడం లేదు. టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భగత్ ఈసారి కూడా ఫేవరెట్‌గా ఉన్నాడు. ఇది తనకు చాలా కఠినమైన నిర్ణయమని భగత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘డోపింగ్‌లో పట్టుబడితే ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. కానీ సాంకేతికంగా నేను అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదు. వేరే ప్రదేశంలో ఉన్నందున రెండుసార్లు టెస్ట్‌లకు దూరమయ్యా. కానీ మూడోసారి ఇవ్వడానికి వెళ్తే వాళ్లు అనుమతించలేదు’ అని పేర్కొన్నాడు.