న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం వేళ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించిన మా నాన్న ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు. ఇదేంటని అడిగితే.. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత తనకు చెప్పారని శర్మిష్ఠ గుర్తు చేశారు.
కానీ మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మృతి సమయంలో సీడబ్ల్యూసీ సమావేశాల్లో సంతాపం తెలిపారని.. ఆ సంతాప సందేశాన్ని రాసింది కూడా మా నాన్న ప్రణబ్ ముఖర్జీనే.. ఈ విషయం బాబా డైరీ ద్వారా నేను తెలుసుకున్నా.. ఈ విషయంలో కాంగ్రెస్ నన్ను తప్పుదోవ పట్టించిందని శర్మిష్ఠ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. మన్మోహన్ సింగ్ స్మారం స్థూపం ఏర్పాటుకు ప్రత్యేక స్థలం కేటాయించాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌కు శర్మిష్ఠ మద్దతు పలికారు. డాక్టర్ సింగ్‌కు స్మారక చిహ్నం ఏర్పాటు చాలా గొప్ప ఆలోచన.. అతను దానికి అర్హుడని కొనియాడారు.
రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనుకున్నారు.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు. కాగా, అనారోగ్యంతో మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సీడబ్ల్యూసీ సంతాపం తెలిపిన విషయం తెలిసిందే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ అయిన సీడబ్ల్యూసీ.. మన్మోహన్ సింగ్ మరణానికి గౌరవార్ధంగా ప్రత్యేక తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే తన తండ్రి ప్రణబ్ ముఖర్జీకి సీడబ్ల్యూసీ సంతాపం తెలపకపోవడంపై శర్మిష్ఠ ఫైర్ అయ్యారు.