ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?

8.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ల గండం

సెప్టెంబర్‌లో 9.80 లక్షల క్యూసెక్కుల వరద

ఇప్పుడు 2 వేల క్యూసెక్కులకు పడిపోయిన ఇన్ ఫ్లో

నాలుగు నెలలుగా భారీగా తగ్గుతున్న నీటి ప్రవాహం

వేసవిలో మరింత తగ్గే చాన్స్​.. లిఫ్టింగ్​ కష్టమే!

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: సర్కారు నీళ్లలెక్క తప్పింది. ఈ యాసంగిలో కాళేశ్వరం కింద భూములన్నీ సాగులోకి తేవాలన్న లక్ష్యం నెరవేరేలా లేదు. అనుకున్న స్థాయిలో ప్రాణహిత నది నుంచి ఫ్లో లేకపోవడంతో మేడిగడ్డలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. దీంతో అవసరం మేరకు నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. నాలుగైదు నెలలుగా ప్రాణహిత నుంచి వచ్చిననీటిని వచ్చినట్టే మేడిగడ్డ నుంచి కిందకు వదిలేశారు. అదే ఫ్లో కొనసాగితే జనవరి నుంచి నీళ్లు నిల్వచేసి యాసంగికి ఇవ్వొచ్చని అనుకున్నారు.. కానీ ఆ ప్లాన్ బెడిసికొట్టింది.

ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రాణహితలో ఇన్​ఫ్లో భారీగా తగ్గిపోయింది. గత సెప్టెంబర్‌‌‌‌‌లో రోజుకు 9.80 లక్షల క్యూసెక్యూల ఇన్‌‌‌‌ఫ్లో ఉంటే.. ఇప్పుడది రెండు వేల క్యూసెక్కులకు పడిపోయింది. సెప్టెంబర్​నుంచి ప్రాణహితలో నీటి ప్రవాహం క్రమేణా తగ్గుతూ వస్తోంది. దీంతో యాసంగి అవసరాలకు నీళ్ల లిఫ్టింగ్  కష్టమేనని అధికారులు భావిస్తున్నారు.

8.50 లక్షల ఎకరాలకు నీళ్లు కష్టమే!

రాష్ట్రంలో యాసంగి పంటలకు నీళ్లివ్వడానికి ఇటీవల కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌‌‌‌హౌస్‌ వద్ద అధికారులు మోటార్లను స్టార్ట్‌‌‌చేశారు. లక్ష్యం మేరకు సాగునీరు అందిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రకటించారు. అయితే ప్రాణహితలో ఇన్‌‌‌‌ఫ్లో పెరగకపోతే యాసంగికి  కాళేశ్వరం నీళ్లివ్వడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు మూడు లింకుల్లో పూర్తవగా, మిగతా నాలుగు లింకుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రాజెక్టు కింద 18.83 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే పూర్తయిన ప్యాకేజీల కింద 8.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాణహితలో ప్రవాహం తగ్గిపోతుండడం, ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఉన్న నీళ్లతో ఈ మొత్తం ఆయకట్టుకు నీళ్లివ్వడం దాదాపు సాధ్యం కాదు. అసలు ఈ ప్రాజెక్టు కింద పాత ఆయకట్టుకు కూడా నీళ్లివ్వడం కష్టమేనని ఇంజినీర్లు అంటున్నారు.

వారం నుంచి రెండు వేల క్యూసెక్కులే

ప్రాణహిత నది ఇన్‌‌‌‌ఫ్లో నేరుగా మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటుంది. ఆగస్టు, సెప్టెంబర్‌‌‌‌‌నెలల్లో కురిసిన భారీ వర్షాలతో సెప్టెంబర్‌‌‌‌‌నెలలో అత్యధికంగా 9.80 లక్షల క్యూసెక్కుల నుంచి 3.78 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో ఉంది. దీంతో అధికారులు మేడిగడ్డ బ్యారేజీ 75 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు వదిలారు.  అక్టోబర్​లో  రోజుకు 3 లక్షల క్యూసెక్కుల నుంచి 56 వేల క్యూసెక్కుల పడిపోయింది. ఈ నెలలో 46 నుంచి 24 గేట్ల వరకు తెరిచి నీటిని వదిలిపెట్టారు. నవంబర్​లో  ఇన్​ఫ్లో రోజుకు 28 వేల క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పడిపోయింది. అయినా అధికారులు 6 నుంచి 4 గేట్లను తెరిచి నీటిని దిగువకు పంపించారు. డిసెంబర్‌‌‌‌‌నెల కొచ్చేసరికి ప్రాణహిత నదిలో వరద చాలా తగ్గుముఖం పట్టింది. రోజుకు 5,700 నుంచి 2,700 క్యూసెక్కులకు పడిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌అధికారులు ఈ నీటి ప్రవాహాన్ని సైతం 4 నుంచి 2 గేట్లు తెరిచి దిగువకు వదిలారు. జనవరిలో గేట్లన్ని మూసివేసి నీటిని నిల్వ చేయడం మొదలుపెట్టారు. అదే నెలలో అత్యధికంగా రోజుకు 6,500 క్యూసెక్కుల నుంచి 2,100 క్యూసెక్కులకు పడిపోయింది. గత వారం రోజులుగా రోజుకు 2వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద రావడం లేదని అధికారులు చెబుతున్నారు.

మేడిగడ్డలో 12.79 టీఎంసీలే

మేడిగడ్డ బ్యారేజీ కెపాసిటీ 16.17 టీఎంసీలు. శనివారం నాటికి 12.79 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఇక్కడ ఆరు మోటార్లు నడిపిస్తూ రోజుకు టీఎంసీ నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ లెక్కన పది రోజుల్లో మేడిగడ్డ ఖాళీకానుంది. ఇన్‌ఫ్లో కూడా గణనీయంగా తగ్గిపోవడంతో ఒక టీఎంసీ నీళ్లు చేరడానికి కనీసం ఆరు రోజులు పడుతుంది. అన్నారం బ్యారేజీ కెపాసిటీ 10.87 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 9 టీఎంసీలు. సుందిళ్లలో 8.83 టీఎంసీలకు 5 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కింది నుంచి ఏకకాలంలో ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తే పది, పన్నెండు రోజుల్లో బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ అవుతాయి. ప్రాజెక్టు కింద యాసంగి పంటలకు ఇంకా 70 టీఎంసీల నీళ్లు అవసరం కాగా, ప్రాణహితలో ఇప్పుడున్న ఇన్‌ఫ్లో లెక్కన 10 టీఎంసీల నీళ్లు చేరడానికి 70 రోజులు ఎదురు చూడాలి. ఈ లెక్కన ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం, టార్గెట్​ మేరకు నీటిని ఎత్తిపోయడం కష్టమే.

కనీసం 100 టీఎంసీలైనా ఎత్తిపోయాలి

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.83 లక్షల పాత ఆయకట్టుకు సాగునీరందించాలి. కాళేశ్వరం వద్ద రోజుకు 3 టీఎంసీల చొప్పున 180 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి, అక్కడినుంచి మిడ్‌‌ మానేరుకు మళ్లించి మొత్తం ఆయకట్టుకు సాగునీరందిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. దీనికోసమే రూ.లక్ష కోట్లతో పనులు చేపట్టింది. మొత్తం 20 లిఫ్ట్‌‌లు నిర్మించి 82 పంప్‌‌లు ఏర్పాటు చేశారు. నీటి నిల్వ కోసం 20 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. కొత్తగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌‌హౌస్​లు కట్టారు. 151.27 టీఎంసీల సామర్థ్యంతో మరో 17 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు.  ఎస్సారెస్పీ స్టేజీ-1 కింద 9,68,640, ఎస్సారెస్పీ-2 కింద 4 లక్షల40 వేలు, ఫ్లడ్‌ ‌ఫ్లో కెనాల్‌‌ కింద రెండు లక్షలు, నిజాంసాగర్‌ కింద 2,34,330, సింగూర్‌ కింద 40 వేల ఎకరాల పాత ఆయకట్టుకు సాగునీరందించాలనేది లక్ష్యం. 18.83 లక్షల పాత ఆయకట్టుకు నీళ్లివ్వాలంటే  మేడిగడ్డ నుంచి కనీసం 100 టీఎంసీల నీళ్లనైనా ఎత్తిపోయాలి.

ఇవి కూడా చదవండి..

పనిచేయకున్నా జీతాలు చెల్లింపు.. ఆపై ప్రమోషన్‌తో బదిలీ

గుహలో భారీగా బంగారం నిల్వలు.. కళ్ల ముందే హింట్ ఉన్నా తెరవలేకపోతున్నారు

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు