చంపుకోవడం కరెక్ట్ కాదు.. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి: కోర్టు జడ్జిమెంట్‎పై ప్రణయ్ తండ్రి హర్షం

చంపుకోవడం కరెక్ట్ కాదు.. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి: కోర్టు జడ్జిమెంట్‎పై ప్రణయ్ తండ్రి హర్షం

నల్లగొండ: తన కొడుకు ప్రణయ్ హత్య కేసు తీర్పుతో ఇకనైనా పరువు హత్యలు ఆగిపోవాలని ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి అన్నారు. దేశంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ మర్డర్ కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ సెషన్ కోర్టు సోమవారం (మార్చి 10) తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ2 నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం.. మిగిలిన దోషులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. నల్గొండ కోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలని అన్నారు.

 ప్రణయ్ హత్య తర్వాత మేం చాలా కోల్పోయాం.. జస్టిస్‌ ఫర్ ప్రణయ్‌ అంటూ ఐదేళ్లుగా పోరాటం చేశామని గుర్తు చేశారు. ఈ హత్య తర్వాత కూడా చాలా పరువు హత్యలు జరిగాయి .. వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కలగాలన్నారు. మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం.. అమృతకు భర్త లేడు.. నాకు కొడుకు లేడు.. నా మనువడికి నాన్న లేడని ఆయన ఎమోషనల్ అయ్యారు. కేసులో ఏ2 నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడగా.. మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార  శిక్ష పడిందని తెలిపారు.

Also Read :- ప్రణయ్ హత్య కేసు నిందితులు వీళ్లే..

ఈ తీర్పుతో దోషులు కుటుంబాలు కూడా బాధపడుతుంటాయి.. కానీ ఈ రకమైన హత్యలకు పాల్పడడం విచారకరమని అన్నారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఐదున్నర సంవత్సరాలు కోర్టు తీర్పుకై వేచి చూశామని.. ఈ తీర్పుతో తృప్తి చెందామని తెలిపారు. మొదటి నుంచి కేసుకు పూర్తిస్థాయిలో సహకరించిన డీఎస్పీ శ్రీనివాస్‎కి కృతజ్ఞతలు.. వందమంది సాక్షులతో.. 1600ల పేజీల చార్జిషీట్‎తో అప్పటి ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో కేసును నిక్కచ్చిగా విచారించారన్నారు. 

ఈ కేసులో న్యాయవాదిగా వ్యవహరించిన దర్శనం నరసింహ, పోలీస్‎లు ఎలాంటి ప్రలాభాలకు లోను కాకుండా న్యాయం పోరాటం చేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ తీర్పు మీకు సంతోషాన్ని ఇచ్చిందా అని చాలామంది అడుగుతున్నారు.. కానీ నాకు ఇది సంతోషం కాదు.. కొడుకును కోల్పోయిన నా బాధను ఎవరూ తీర్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఎవరి మీద కోపం లేదని.. కాకపోతే ఇకనైనా ఇలాంటి హత్యలు ఆగాలని  సాక్షాలు చెప్పామని పేర్కొన్నారు. ఈ తీర్పు ద్వారా దేశంలో చట్టం, న్యాయం అనేది ఉందని రుజువైందన్నారు.