- 1,400 ఫోన్ నంబర్ల డేటా రిట్రీవ్ చేసిన ఎఫ్ఎస్ఎల్
- హైకోర్టు జడ్జి భార్య ఫోన్ నంబర్ నూ ట్యాప్ చేసిన ప్రణీత్ టీమ్
- సిట్ విచారణలో వెలుగు చూస్తున్న నిజాలు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచనాలు వెలుగుచూస్తున్నాయి. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఐఏఎస్ దివ్యా దేవరాజన్, సిటీ మాజీ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ తో పాటు ఓ హైకోర్టు జడ్జి భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను విచారణలో నిందితులు భుజంగరావు, తిరుపతన్న వెల్లడించినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నంబర్ల ఆధారంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, లాగర్ రూమ్ హార్డ్ డిస్క్‌ల డేటాను రిట్రీవ్చేస్తున్న ఎఫ్ఎస్ఎల్(ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ) నుంచి సిట్ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు.
ఇందులో తాజాగా ఇద్దరు ఐపీఎస్‌లు, ఓ మహిళా ఐఏఎస్‌తో పాటు ఓ హైకోర్టు జడ్జి భార్య ఫోన్ నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4 నెలల వ్యవధిలో1,400కు పైగా ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 340 జీబీ వరకు ఉన్న డేటాలో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రతిపక్ష పార్టీల నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ఫోన్ సంభాషణలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, 6వ నిందితుడైన శ్రవణ్‌రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. రెడ్‌కార్నర్ నోటీసుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీబీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ చొరవ తీసుకుంటే రెడ్‌కార్నర్ నోటీసులు త్వరగానే జారీ అవుతాయని, వీరిద్దరినీ తప్పకుండా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్‌తోనే బీఆర్ఎస్లోకి ఆర్ఎస్పీ?
పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక విభాగాల్లో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ సెక్రటరీగా పనిచేస్తూ 2021 జులైలో వీఆర్ఎస్ తీసుకుని బీఎస్పీలో చేరారు. అప్పటి నుంచి ఆర్ఎస్పీ కదలికలపైనా బీఆర్ఎస్ సర్కార్ నిఘా పెట్టింది. ఆర్ఎస్పీ ఫోన్ ను ట్యాప్ చేసి ఆయన ప్రతి కదలికనూ సర్కారు పెద్దలకు ప్రణీత్‌రావు టీమ్ చేరవేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ తో ఆర్ఎస్పీ లోటుపాట్లు తెలుసుకుని, బీఆర్ఎస్ లో చేరేలా పావులు కదిపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కమ్మ నేతలపైనా నిఘా
ఏఆర్ శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయనపైనా బీఆర్ఎస్ సర్కార్ నిఘా పెట్టినట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ లో కొందరు కమ్మ సామాజికవర్గం నేతలు శ్రీనివాస్ తో భేటీ అవుతున్నారని, కమ్మ వర్గం ఓట్లను చీల్చుతున్నారనే అనుమానంతో వారిపై నిఘా పెట్టినట్టు సమాచారం. శ్రీనివాస్ ఫోన్ నెంబర్ కూడా ప్రణీత్ రావు టీం టార్గెట్ లిస్టులో ఉన్నట్టు ఈ మేరకు అధికారులు ఆధారాలు సేకరించారు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో మహిళా శివు సంక్షేమ శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్ దివ్యా దేవరాజన్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు తెలిసింది. హాస్టళ్లకు గుడ్ల సరఫరాలో అక్రమాలకు తావులేకుండా కఠినంగా వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు ఓ మంత్రికి ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేసినట్టు సమాచారం. ఆమె ఫోన్ డేటాకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాకే ఎలాంటి సమాచారం సేకరించారన్నది తెలియనుందని చెప్తున్నారు.