ఢిల్లీ: ఆలయాల్లో ప్రసాదాల తయారీ నిబంధనలను సమీక్షించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా.. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కేవలం ప్రసాదం గురించి మాత్రమే ఎందుకు..? హోటల్స్లో ఫుడ్, ఫుడ్ ఐటమ్స్ నాణ్యతా ప్రమాణాలపై కూడా పిటిషన్ ఫైల్ చేయొచ్చు కదా..?’ అని పిటిషనర్ కౌన్సిల్ను ధర్మాసనం ప్రశ్నించింది.
ఏదైనా ఒక ఆలయ ప్రసాదంలో నాణ్యతా ప్రమాణాలు కొరవడితే.. ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. ఆలయాల్లో ప్రసాదం నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సిన బాధ్యత ఆ ఆలయ ఈవోదేనని నవంబర్ 26న దేశ ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.
అయితే ఇది కేవలం పబ్లిసిటీ కోసం దాఖలు చేసిన పిటిషన్ కాదని, పలు ఆలయాల్లో ప్రసాదం కల్తీ కావడంతో, ఆ ప్రసాదం తిని భక్తులు అస్వస్థతకు గురయ్యారని.. అందువల్ల సుప్రీం కోర్టు ఈ పిటిషన్పై విచారణ జరపాలని పిటిషనర్ కౌన్సిల్ న్యాయస్థానాన్ని కోరింది. ఈ సమయంలోనే.. ‘ప్రసాదం విషయంలోనే ఎందుకు..? స్టోర్స్లో కొనుగోలు చేసే కిరాణా వస్తువులు, ఫుడ్ ఐటమ్స్, హోటల్స్లో ఫుడ్.. అక్కడ కూడా కల్తీ జరిగే అవకాశం ఉంది కదా..!’ అని బెంచ్ ప్రశ్నించింది.
తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లోని ప్రసాదాల నాణ్యతపై చర్చ జరిగింది. ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై నిఘా పెరిగింది.