టీఆర్​ఎస్​తో ప్రశాంత్ కిశోర్ దోస్తీ

టీఆర్​ఎస్​తో ప్రశాంత్ కిశోర్ దోస్తీ
  • రాష్ట్ర  కాంగ్రెస్​లో తొలగిన అయోమయం
  • రేవంత్​ వర్గీయుల్లో సంబురం.. వారం రోజుల గందరగోళానికి ముగింపు

హైదరాబాద్​, వెలుగు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ కాంగ్రెస్​కు దూరమయ్యారు. కాంగ్రెస్​లో చేరాలని సోనియా గాంధీ ఇచ్చిన ఆఫర్​ను ఆయన తిరస్కరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​సుర్జేవాలా మంగళవారం ట్వీట్​ చేశారు. కొద్ది నిమిషాలకే పీకే దీన్ని ధ్రువీకరించారు. వెనువెంటనే జరిగిన ఈ పరిణామాలతో రాష్ట్ర  కాంగ్రెస్​ నేతలు ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే.. టీఆర్​ఎస్​తో పీకే దోస్తీ కొనసాగుతుందనే విషయంలో క్లారిటీ వచ్చింది. వాస్తవానికి ప్రశాంత్​ కిశోర్​ కాంగ్రెస్​లో చేరుతారని వారం పది రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది.

కాంగ్రెస్​ చీఫ్​ సోనియా గాంధీతో పీకే మూడు సార్లు సమావేశమైనందున ఇది మరింత బలపడింది. పీకేను కాంగ్రెస్​లో చేర్చుకోవాలంటే ఆయన ఇతర పార్టీలతో పెట్టుకున్న ఎన్నికల వ్యూహాల ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సోనియా షరతు విధించారని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పీకే శనివారం (23న) రాష్ట్రానికి వచ్చి ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​ను కలిశారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్న ఆయన సీఎం ఫామ్​హౌస్​కు కూడా వెళ్లి చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల కోసం టీఆర్​ఎస్​ తరఫున తన ఐప్యాక్​ సంస్థ పని చేస్తుందని, తాను కాంగ్రెస్​లో చేరబోతున్నానని చెప్పడానికే వచ్చారని అంతా నమ్మారు. టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్.. ఐప్యాక్​ తమ పార్టీ కోసం పని చేస్తుందని మీడియాకు తెలిపారు. 
పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి కూడా కాంగ్రెస్​లో చేరబోయే పీకే టీఆర్​ఎస్​తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకే వచ్చారన్నారు. ఈ పరిణామాలు ఇలా కొనసాగుతున్న క్రమంలోనే కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ పొత్తు కలుస్తున్నాయని ప్రచారం జరిగింది. దీంతో కొందరు కాంగ్రెస్​ నేతలు కూడా అయోమయంలో పడ్డారు. అసలేం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. ఈ చర్చంతా ఇంకా హాట్​హాట్​గా కొనసాగుతూ ఉండగానే పీకే విషయం మంగళవారం తేలిపోవడంతో కాంగ్రెస్​ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా రేవంత్​ వర్గీయులు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్​ నీడనూ కాంగ్రెస్​పై పడనీయబోమనే రేవంత్​ మాటలకు తాజా పరిణామాలతో బలం చేకూరిందని చెప్తున్నారు. 
డబ్బు పనిచేసిందా.. ఇంకేమైనానా?
పీకే ఇక టీఆర్ఎస్​ తరఫున పని చేస్తారనేది స్పష్టమైనందుకు రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు సంబురపడుతున్నారు. ఇటీవల జీహెచ్​ఎంసీ ఆఫీసు దగ్గరకు వచ్చిన  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు  కేఏ పాల్ మాట్లాడుతూ.. కేసీఆర్​, పీకేకి మధ్య రెండు వందల కోట్ల రూపాయల డీల్​ కుదిరిందని ఆరోపించారు.  వాస్తవానికి పీకే కాంగ్రెస్​లో చేరే ఉద్దేశంతోనే ఉన్నారని, అయితే కేసీఆర్​తో రెండు రోజుల పాటు జరిగిన చర్చల ప్రభావం ఆయనపై పడి ఉంటుందని సీనియర్​ కాంగ్రెస్​ నేత ఒకరు అన్నారు. డబ్బు పని చేసిందా లేదా ఇంకేమైనా అంశాల ప్రభావం ఉందా అన్నది అనుమానంగా ఉందని పేర్కొన్నారు.

మరో వ్యూహకర్త సునీల్​ కొనుగోలు ఎలాంటి పాత్ర పోషిస్తారనే విషయంలో కూడా కాంగ్రెస్​లో సందిగ్ధత తొలగిందని ఆ పార్టీ నేతలు సంతోషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు సునీల్  వ్యూహకర్తగా కొనసాగుతారనే విషయంలో స్పష్టత వచ్చిందంటున్నారు. కాగా, తాజాగా పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేష్​ కుమార్​ గౌడ్​.. పీకే తమ పార్టీలో చేరకపోయినా, సూచనలు ఇస్తారని చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఏఐసీసీ నుంచి తమకు ఇలాంటి సమాచారమే వచ్చిందన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

వీ6–వెలుగు పిటిషన్​పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఇయ్యాల టీఆర్​ఎస్​ ప్లీనరీ.. జాతీయ రాజకీయాలే ఎజెండా!