చెంపదెబ్బకొట్టి లాక్కెళ్లారు..,ప్రశాంత్ కిశోర్ అరెస్ట్పై సపోర్టర్లు ఆరోపణ

చెంపదెబ్బకొట్టి లాక్కెళ్లారు..,ప్రశాంత్ కిశోర్ అరెస్ట్పై సపోర్టర్లు ఆరోపణ

పట్నా: బిహార్  పబ్లిక్  సర్వీస్  కమిషన్(బీపీఎస్​సీ) నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్  కిశోర్ ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పట్నాలోని గాంధీ మైదాన్ లో గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న పీకేతో పాటు 43 మంది మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం పీకేను పట్నా ఎయిమ్స్ కు తరలించారు. 

కాగా.. ధర్నా ప్రాంతం నుంచి పోలీసులు తమను బలవంతంగా తరలించారని, ప్రశాంత్ కిశోర్ ను చెంపదెబ్బ కొట్టారని ఆయన సపోర్టర్లు ఆరోపించారు. ఈ ఆరోపణలను పట్నా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్  సింగ్ ఖండించారు. పోలీసులు ఎవరిమీదా చేయిచేసుకోలేదని మీడియాకు వివరించారు. పీకే అరెస్టును అడ్డుకుంటున్న ఆయన మద్దతుదారులను మాత్రమే పక్కకు తప్పించారని చెప్పారు. 

పీకేతో పాటు ఆయన సపోర్టర్లు కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారని, త్వరలోనే వారిని కోర్టులో ప్రవేశపెడతారని చెప్పారు. ‘‘నిషేధిత ప్రాంతంలో ధర్నా చేస్తున్నందువల్లే పీకే, ఆయన సపోర్టర్లను బలవంతంగా తరలించాల్సి వచ్చింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినలేదు. ధర్నాను గర్దనీ బాఘ్ కు మార్చాలని నోటీసులు కూడా పంపించాం. అయినా వారు వినలేదు” అని కలెక్టర్  చెప్పారు. 

15 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, వాటిలో 3 ట్రాక్టర్లు ఉన్నాయని కలెక్టర్  పేర్కొన్నారు. ‘‘పీకే సపోర్టర్లను చెక్ చేయగా.. 30 మంది గుర్తింపు దొరికింది. వారిలో ఒక్కరు కూడా బీపీఎస్ సీ ఆశావహుడు కాదు. కనీసం వారు స్టూడెంట్లు కూడా కాదు. స్టూడెంట్లమని చెప్పుకుంటున్న వారిని విచారిస్తున్నాం. అదుపులోకి తీసుకున్న వారిలో ఐదుగురే పట్నాకు చెందినవారు.  మిగతా వారందరూ బయటి రాష్ట్రాల వారు” అని కలెక్టర్  వివరించారు.