![జగన్ బాటలో తమిళ సినీ నటుడు విజయ్.. పొలిటికల్గా బిగ్ డెసిషనే ఇది..!](https://static.v6velugu.com/uploads/2025/02/prashant-kishore-surprise-meeting-with-trp-leader-actor-vijay_VOyqaw4CEQ.jpg)
చెన్నై: తమిళ సినీ నటుడు విజయ్ రాజకీయంగా వైసీపీ అధినేత జగన్ బాటను ఎంచుకున్నారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ విజయ్తో భేటీ కావడం తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2026 ఏప్రిల్లో గానీ, మేలో గానీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలా చూసుకుంటే సినీపరంగా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ రాజకీయంగా ఎదిగేందుకు సమయం చాలా తక్కువగా ఉంది. దీంతో.. ఉన్న ఈ సమయాన్ని రాజకీయ ఎదుగుదలకు ఎలా వినియోగించుకుంటే ప్రజల్లోకి బలంగా వెళ్లొచ్చనే యోచనలో ప్రస్తుతం విజయ్ ఉన్నారు.
ఇందుకు తగిన ప్రణాళికలు, వ్యూహాలను రూపొందించేందుకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవసరం అనివార్యమని ఆయన భావించారు. ఈ క్రమంలోనే.. విజయ్ నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్కు పిలుపు అందింది. ఆగమేఘాల మీద ప్రశాంత్ కిషోర్ చెన్నైకి వెళ్లి మరీ విజయ్ను కలిశారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో (234) పోటీ చేయాలని తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టుగానే తన టీవీకే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటీవల తమిళనాడు అంతటా టీవీకే పార్టీకి జిల్లా కార్యదర్శులను విజయ్ నియమించారు.
చెన్నైలోని నీలన్ గరై ప్రాంతంలో ఉన్న విజయ్ నివాసంలో ప్రశాంత్ కిషోర్తో విజయ్ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో విజయ్తో పాటు టీవీకే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న జనరల్ సెక్రటరీ ఎన్.ఆనంద్, అధర్వ్ అర్జున, జాన్ అరోకియసామి కూడా ఉన్నారు. 2019లో ఏపీలో వైసీపీ గ్రాండ్ విక్టరీలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పీకే రాజకీయ వ్యూహాలు వైసీపీకి చాలానే ఉపయోగపడ్డాయి. వైసీపీ అధినేత జగన్ కూడా పీకేను అప్పట్లో పొగడ్తలతో ముంచెత్తారు. ఇదిలా ఉండగా.. విజయ్, ప్రశాంత్ కిషోర్ భేటీకి అధర్వ్ అర్జున కారణం అని తెలిసింది.